కేంద్రం వైఖరిని తప్పుపట్టిన ప్రతిపక్షాలు
ఫౌండర్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) విదేశీ శక్తుల కుట్రంటూ కేంద్ర ప్రభుత్వం ముద్ర వేస్తోంది. కేంద్రం తీరును ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ‘దేశ వ్యతిరేక’ ముద్ర వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఉద్యమానికి తెరలేపిన సీజేపీపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోంది. దానిపై విచారణ చేయిస్తోంది. అందుకనుగుణంగా ఇంటెలిజెన్స్ బ్యూరోను ఆదేశించింది. దేశంలో నిరుద్యోగ యువత అసంతృ ప్తిని ఆసరాగా చేసుకుని అశాంతిని సృష్టించేందుకు వ్యూహం పన్నారనే కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ రావడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందేమోనని భావిస్తూ ఆరా తీస్తున్నారు.
న్యాయవ్యవస్థపై ఆర్టీఐ యాక్టివిస్టుల తీరును తప్పుబడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వారిని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చుతూ సీజేఐ సూర్యకాంత్ ఘాటుగా స్పందించారు. ఆయన తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వ్యంగ్యాత్మక ఉద్యమం పుట్టు కొచ్చింది. కేవలం ఐదు రోజుల్లోనే సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 1.5 కోట్ల ఫాలోవర్లు దాటిపోయారు. అధికార బీజేపీ ఫాలోయింగ్‌నీ సీజేపీ దాటేయడం తీవ్ర చర్చన ీయాంశమైంది. నిరుద్యోగం, నీట్ పేపర్ లీకేజీలు, ఆర్థిక ఇబ్బందులపై జెన్-జీ యువత డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వేదికగా ఉద్యమానికి దిగారు. అయితే, ఒకే తరహా హ్యాష్‌ట్యాగ్‌లు, ఏఐ సాంగ్స్, సింక్రనైజ్డ్ పోస్టుల వెనుక డీప్ స్టేట్ ఐటీ సెల్స్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, యువత వ్యంగ్య నిరసనను అణచివేయడానికి మోడీప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ‘దేశ వ్యతిరేక’ ముద్ర వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శకులు సైతం మండి పడుతున్నారు.
సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేకు బెదిరింపులు సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేను చంపే స్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. వాట్సాప్‌లో వార్నింగ్‌లు వస్తున్నాయని అభిజీత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆయన పోస్ట్ చేశాడు. అందులో అభిజీత్ ఈ అకౌంట్‌ను మూసేస్తే డబ్బులు వస్తాయని, లేదా బీజేపీలో చేరాలని సూచించారు. లేకుంటే అమెరికాలో చంపేస్తామని ఆ స్క్రీన్ షాట్‌లో కనిపిస్తోంది. అంతకుముందు ఆయన తల్లిదండ్రులు భగవాన్, అనితా దీప్కేలు సైతం ఈ అంశంపై ఆందోళన వ్యక్తపరిచారు.
రెండు రోజుల క్రితమే భద్రతా కారణాల పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దేశంలో సీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాను నిలిపివేశారు. ఇప్పుడు ఈ పార్టీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా నిషేధించాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. భద్రతా కారణాల పేరుతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఇండియా నుంచే 94.7 శాతం మంది ఫాలోవర్లు
మరోవైపు ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్‌కు ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఇప్పటికే 20 మిలియన్ల మందికి పైగా కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న పార్టీ అకౌంట్‌గా నిలిచింది. దీనికి ముందు అతిపెద్ద పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అకౌంట్లను ఇది దాటేసింది. అయితే, ఈ ఫాలోవర్ల విషయంలో కూడా వివాదానికి బీజేపీ అనుబంధ సంఘాలు తెర లేపాయి. పాకిస్తాన్, అమెరికా, బంగ్లాదేశ్ నుంచే అత్యధికులు ఫాలోవర్లగా ఉన్నారని ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఇదంతా ఫేక్ ప్రచారమని సీజేపీ ఫౌండర్ అభిజీత్ స్పష్టం చేస్తున్నారు. తన ఫాలోవర్లకు సంబంధించిన ఒరిజినల్ డాటాను ఆయన పంచుకున్నారు. అందులో ఇండియా నుంచే 94.7 శాతం మంది ఫాలోవర్లున్నారు.



