Sunday, February 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉత్సాహంగా ఐఐటీ హైదరాబాద్‌ పర్యటన

ఉత్సాహంగా ఐఐటీ హైదరాబాద్‌ పర్యటన

- Advertisement -

ఐఐటీ క్యాంపస్‌, ఇంజినీరింగ్‌, సైన్స్‌ విభాగాల గురించి తెలుసుకున్న విద్యార్థులు

నవతెలంగాణ-సిటీబ్యూరో
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అర్బన్‌(2.0)లో భాగంగా జీహెచ్‌ఎంసీ శనివారం పారిశుధ్య కార్మికుల పిల్లలతో ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర శానిటేషన్‌ కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్‌ అవకాశాలను చూపించేందుకు ఐఐటీ హైదరాబాద్‌కు పర్యటన ఏర్పాటు చేసింది. ”సిటీ వీధుల నుంచి ఐఐటీ కలల దాకా” పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నగర పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యపై నమ్మకం కల్పించడం, సామాజిక-ఆర్థిక అడ్డంకులను అధిగమించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పర్యటన జరిగింది. విద్యార్థులకు క్యాంపస్‌ జీవితం, ఇంజినీరింగ్‌, సైన్స్‌ విభాగాల పరిచయం, ఐఐటీ ప్రవేశంపై వివరాలు అందించారు.

‘ప్రయాస్‌’ ఆధ్వర్యంలో మోటివేషనల్‌ ఇంటరాక్షన్‌తో ప్రారంభమైన కార్యక్రమంలో విద్యార్థులు అకడమిక్‌ భవనాలు, లైబ్రరీ (నాలెడ్జ్‌ రిసోర్స్‌ సెంటర్‌), స్పోర్ట్స్‌, కల్చరల్‌ కాంప్లెక్స్‌ను సందర్శించారు. క్యాంపస్‌ మెస్‌లో భోజనం చేసి విద్యార్థులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా చూసారు. చివరగా లెక్చర్‌హాల్‌ కాంప్లెక్స్‌లో ఐఐటీ అధ్యాపకులు, విద్యార్థులు కలిసి స్వీయ విశ్వాసం, కెరీర్‌ ప్లానింగ్‌, కష్టాలను అధిగమించే మార్గాలపై చర్చించారు. ఎల్‌బీనగర్‌, హెడ్‌ ఆఫీస్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి, చార్మినార్‌ జోన్ల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ఆరు వాహనాలు ఏర్పాటు చేశారు. బ్రేక్‌ ఫాస్ట్‌, భోజన పర్యవేక్షణను అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఐఐటీ హైదరాబాద్‌ అధికారులతో కలిసి నిర్వహించారు. ప్రతి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ నుంచి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేయగా నోడల్‌ అధికారుల సమన్వయంతో కార్యక్రమం సజావుగా సాగింది. నగర అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని పెంచుతూ, శానిటేషన్‌ కార్మికుల కృషిని గుర్తించి, వారి పిల్లల భవిష్యత్‌ కలలకు పెట్టుబడి పెట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -