నవతెలంగాణ-హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసిన బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ క్రమంలో న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగుతోందని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అత్యవసర విచారణలు జరపాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్లను పరిశీలించారు.
అయితే ఈ అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దంటూ సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్‌కు సూచించారు. ఈ అంశంలో ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అత్యవసర విచారణ జరపాల్సినంత సీన్ లేదు. సమయం వచ్చినప్పుడు కోర్టు ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది అని లాయర్ గోస్వామిని ఉద్దేశిస్తూ సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
కాగా, మే 15న జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ‘‘కొందరు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు..’’ అంటూ సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక, వృత్తుల్లో స్థానం దక్కని కొందరు యువకులు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు. కొందరు మీడియాగా, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ టార్గెట్ చేస్తుంటారు అని పేర్కొన్నారాయన.


