నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ తొలి క్యాలిఫయర్‌లో ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలకు గాను 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. రజత్ పటిదార్(93 నాటౌట్) కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడాడు. కోహ్లీ(43), అయ్యార్(19), పడిక్కల్(30), కృనాల్ పాండ్య(43), జితేష్(15) రాణించారు.
తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యార్ అదిరే ఆరంభాన్నించారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి జోరు మీదున్న అయ్యార్..రబాడ వేసిన రెండో ఓవర్లో సిక్స్ కొట్టి తర్వాత బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు. 7 బంతుల్లో 19 రన్స్ చేశాడు అయ్యార్. ఆ తర్వాత క్రీజులోకి పడిక్కల్ విరాట్‌తో కలిసి ఆచితూచి ఇన్నింగ్స్ ఆడారు. పవర్ ప్లే ముగిసేరికి ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 65 పరుగులు చేసింది. ఇరువురు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే 7వ ఓవర్ వేసిన హోల్డర్ బెంగళూర్‌ను భారీ దెబ్బకొట్టారు. ఒకే ఓవర్లో పడిక్కల్(30), కోహ్లీ(43)లను ఔట్ చేశాడు. ఇరువురి నిష్కమణతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దం నెలకొంది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పాటిదార్, కృనాల్ పాండ్యా రన్ రేట్ తగ్గకుండా స్ట్రైక్ రోటైయిట్ చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ, సిక్స్ లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మంచి ఊపులో ఉన్న కృనాల్ పాండ్య(43)ను రబాడ పెవిలియన్ పంపించాడు. వికెట్ పడినా పటిదార్ తన జోరును తగ్గించలేదు. టీమ్ డేవిడ్‌తో కలిసి జీటీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 9 సిక్స్, 5 ఫోర్లలతో అర్ధ సెంచరీతో చెలరేగాడు. పటిదార్ ఆట ధాటికి ఆర్సీబీ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. చివరి బంతి వరకు క్రీజులో నిలబడి జీటీ ముందు 255 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచాడు. జీటీ బౌలర్లు రబాడ, హోల్డర్ రెండు వికెట్లు, కృష్ణ ఒక వికెట్ తీశారు.



