అరినా సబలెంక శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ (ఫ్రాన్స్) : ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ వేటను డిఫెండింగ్ చాంపియన్ కొకొ గాఫ్ ఘనంగా మొదలెట్టింది. నాల్గో సీడ్ అమెరికా భామ మంగళవారం జరిగిన తొలి రౌండ్ పోరులో సహచర అమెరికా క్రీడాకారిణి టేలర్ డౌన్‌సెండ్‌పై వరుస సెట్లలో గెలుపొందింది. 6-4, 6-0తో టేలర్ డౌన్‌సెండ్‌ను చిత్తు చేసిన కొకొ గాఫ్ అలవోక విజయంతో ప్రత్యర్థులకు హచ్చరికలు జారీ చేసింది. ఓ ఏస్, ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడిన గాఫ్ ఏకంగా ఆరు సార్లు టేలర్ సర్వ్‌ను బ్రేక్ చేసింది. పాయింట్ల పరంగా 66-45తో కొకొ గాఫ్ ఆధిపత్యం చెలాయించింది. జపాన్ స్టార్ నవొమి ఒసాక సైతం మహిళల సింగిల్స్‌లో ముందంజ వేసింది. జర్మనీ క్రీడాకారిణి లారా సిగెమండ్‌పై 6-3, 7-6(7-3) నవొమి ఒసాక వరుస సెట్లలో విజయం సాధించింది. నాలుగు ఏస్‌లు కొట్టిన ఒసాక.. రెండు బ్రేక్ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 82-68తో లారాపై ఒసాక పైచేయి సాధించింది. కెరీర్ ఉజ్వల స్థితిలో ఉండగా పలు కారణాలతో విరామం తీసుకున్న ఒసాక.. ఇప్పడు గ్రాండ్‌స్లామ్ వేటలో తనదైన శైలిలో పోటీపడుతోంది. టాప్ సీడ్, వరల్డ్ నం.1 అరినా సబలెంక సైతం శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో బెలారస్ స్టార్‌కు స్పెయిన్ ప్లేయర్ జెస్సీకా ఆశించిన పోటీ ఇవ్వలేదు. ఒక్క ఏస్ కూడా కొట్టని సబలెంక.. ఆరు బ్రేక్ పాయింట్లతో జెస్సీకాపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది.
సబలెంక 12 గేములు గెల్చుకోగా.. జెస్సికా రెండు గేముల్లో కలిపి ఆరు గేములే సొంతం చేసుకుంది. పాయింట్ల పరంగా 62-50తో సబలెంక పైచేయి సాధించింది. గ్రీసు అమ్మాయి మరియా సక్కరి సైతం వరుస సెట్లను టైబ్రేకర్లలో సాధించి ముందంజ వేసింది. 7-5, 7-6(7-3)తో వరుస సెట్లలో చెక్ రిపబ్లిక్ అమ్మాయి లిండా నొస్కోవపై సక్కరి గెలుపొందింది. ఏడు ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లతో సక్కరి ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. పాయింట్ల పరంగా 88-71తో పైచేయి నిలుపుకుంది. పురుషుల సింగిల్స్‌లో గ్రీసు స్టార్ ఆటగాడు స్టెఫానోస్ సిటి్సపాస్ ముందంజ వేశాడు. ఫ్రాన్స్ ఆటగాడు అలెంగ్జాండ్రె ముల్లర్‌పై 6-3, 3-0తో ముందంజలో కొనసాగుతుండగా.. ముల్లర్ వాకోవర్ ఇచ్చాడు. దీంతో సిటి్సపాస్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆరో సీడ్, రష్యా స్టార్ ఆటగాడు డానిల్ మెద్వదేవ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో ఐదు సెట్ల సమరంలో ఆస్ర్టేలియా ఆటగాడు ఆడమ్ వాల్టన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 2-6, 6-1, 1-6, 6-1, 4-6తో మెద్వదేవ్ పరాజయం పాలయ్యాడు. క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్ సైతం ఓటమి చెందాడు. 6-7(4-7), 2-6, 1-6తో మోయిసె కౌమె చేతిలో వరుస సెట్లలో తేలిపోయాడు. మారిన్ సిలిచ్ నాలుగు సార్లు సర్వ్ కోల్పోయి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. పాయింట్ల పరంగా 112-81తో సిలిచ్ వెనుకంజ వేశాడు.



