నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ అధ్యక్షతన ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు భేటీ అయ్యాయి. ప్రధానంగా ఈ సమావేశంలో ఉగ్రవాద నిరోధక చర్యలు కీలక అంశంగా చర్చకు వచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్ నాయుడు కాకనూర్ తెలిపారు.
అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంత సముద్ర భద్రత, సముద్ర మార్గాల బలోపేతంపై కీలక చర్చలు జరిగాయని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, నిరంతర వాణిజ్య రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని విదేశాంగ మంత్రులు ప్రాధాన్యంగా ప్రస్తావించినట్లు వివరించారు. అలాగే కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్‌వర్క్’ను కూడా ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా కీలక ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడుల రంగాల్లో పరస్పర సహకారం పెంచాలని క్వాడ్ దేశాలు నిర్ణయించాయని చెప్పారు. విశ్వసనీయ సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడం ద్వారా ఆధునిక తయారీ రంగం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలకు మద్దతు అందించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు.



