నవతెలంగాణ – నాచారం
కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తోందని మేడ్చల్ జిల్లా సీఐటీయూ కోశాధికారి పి. గణేష్ అన్నారు. సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాచారంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి గణేష్ సీఐటీయూ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1970 మే 30న కార్మిక వర్గ ఐక్యత, హక్కుల పరిరక్షణ ధ్యేయంగా సీఐటీయూ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి నేటి వరకు కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం నిరంతర ఉద్యమాలు సాగిస్తోందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లోపించిందని నాయకులు విమర్శించారు.
పెరిగిన నిత్యావసర ధరలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వేతనాలను నిర్ణయించారని ఆరోపించారు. కార్మికులకు గౌరవప్రదమైన జీవనం కల్పించేలా శాస్త్రీయ ప్రమాణాలతో కనీస వేతనాలను పునర్నిర్ణయించాలని డిమాండ్ చేశారు.అలాగే నూతన లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగితే సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కార్మిక సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బలరాజ్, సంజీవ్, అంజయ్య, ఎల్లేష్, రమేష్, రామకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.



