Monday, June 1, 2026
E-PAPER
Homeఆటలుచాంపియన్స్‌ సాచి

చాంపియన్స్‌ సాచి

- Advertisement -

సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ సాత్విక్‌, చిరాగ్‌ వశం
ఫైనల్లో వరల్డ్‌ నం.3 ఇండోనేషియా జోడీపై గెలుపు
రెండేండ్ల తర్వాత 
తొలి టైటిల్‌ నెగ్గిన భారత స్టార్స్‌

సింగపూర్‌ : తెరదించిన సాత్విక్‌, చిరాగ్‌ సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ విజేతగా నిలిచిన భారత తొలి డబుల్స్‌ జోడీగా నిలిచారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో వరల్డ్‌ నం.3 ఇండోనేషియా షట్లర్లు ఫజర్‌ అల్ఫియన్‌, మహ్మద్‌ షోయబుల్‌ ఫిక్రిపై 18-21, 21-17, 21-16తో మూడు గేముల ఉత్కంఠ పోరులో సాత్విక్‌, చిరాగ్‌ పైచేయి సాధించారు. ఇండోనేషియా షట్లర్లతో ముఖాముఖి రికార్డు 1-2తో టైటిల్‌ పోరును షురూ చేసిన సాత్విక్‌, చిరాగ్‌లు టైటిల్‌ కోసం ఒక గంట 13 నిమిషాల పాటు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఉత్కంఠగా సాగిన తొలి గేమ్‌ను 18-21తో చేజార్చుకున్న సాత్విక్‌, చిరాగ్‌లు ఆ తర్వాత వరుస గేముల్లో అదరగొట్టారు. లాంగ్‌ ర్యాలీలపై ఎక్కువ దృష్టి నిలిపిన సాత్విక్‌, చిరాగ్‌లు ఇండోనేషియన్‌ జోడీపై పైచేయి సాధించారు. రెండో గేమ్‌లో 8-8తో సమవుజ్జీలుగా నిలిచిన తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించిన సాత్విక్‌, చిరాగ్‌లు 11-8తో విరామ సమయానికి ముందంజ వేశారు. ద్వితీయార్థంలో మరో మూడు పాయింట్లు సాధించి 14-8తో భారత జోడీ తిరుగులేని ఆధిక్యం దిశగా సాగింది. అదే జోరు కొనసాగిస్తూ 21-17తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 8-5, 11-5తో విరామ సమయానికి ముందంజ వేసిన సాత్విక్‌, చిరాగ్‌లు స్వేచ్ఛగా స్మాష్‌లు ఆడారు. సెకండ్‌హాఫ్‌లో ఇండోనేషియా షట్లర్లు పుంజుకునే ప్రయత్నం చేసినా.. ఏ దశలోనూ స్కోరు సమం చేయలేకపోయారు. 21-16తో మూడో గేమ్‌ను ఖాతాలో వేసుకున్న సాత్విక్‌,చిరాగ్‌లు.. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టైటిల్‌ను ముద్దాడారు.

చివరగా 2024 థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో చాంపియన్స్‌గా నిలిచిన సాత్విక్‌,చిరాగ్‌లు ఆ తర్వాత నాలుగు టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. ఇటీవల గాయం నుంచి కోలుకుని థామస్‌ కప్‌ బరిలో నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌లు భారత జట్టు కాంస్య పతకం సాధించటంలో కీలక పాత్ర పోషించారు. థామస్‌ కప్‌ ఉత్సాహంతో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన సాత్విక్‌, చిరాగ్‌లు అక్కడ టైటిల్‌కు అడుగు దూరంలో ఆగిపోయినా.. సింగపూర్‌ ఓపెన్‌లో సూపర్‌ షోతో చాంపియన్స్‌గా నిలిచారు. ఆల్‌ చైనీస్‌ మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ లియు, టాన్‌పై 22-20, 21-19తో నాల్గో సీడ్‌ జియా, జాంగ్‌లు గెలుపొందారు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో దక్షిణ కొరియా షట్లర్‌, వరల్డ్‌ నం.1 ఆన్‌ సె యంగ్‌ 21-11, 17-21, 21-19తో అకానె యమగూచి (జపాన్‌)పై గెలుపొంది టైటిల్‌ సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ డెన్మార్క్‌ జోడీ 17-21, 21-12, 21-12తో జపాన్‌ జంటపై గెలుపొంది టైటిల్ దక్కించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -