నవతెలంగాణ-హైదరాబాద్ : వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సూచనలు చేసింది. ఇకపై ట్రాఫిక్ చలాన్ల సమాచారం ఎప్పటికప్పుడు పక్కాగా వాహన యజమానులకు చేరేలా రవాణా శాఖ సరికొత్త నిబంధనను తీసుకువచ్చింది. వాహన చలాన్లకు సంబంధించిన అలర్ట్స్ పొందేందుకు ప్రతి ఒక్కరూ తమ వివరాలను తక్షణమే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. కొత్త రూల్స్ ప్రకారం.. వాహనదారులు తమ మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ vahan.parivahan.gov.in లో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, నెల రోజుల గడువు ముగిసినా.. వాహన్ పోర్టల్‌లో నమోదై ఉన్న మొబైల్ నంబరు, ఈ-మెయిల్‌కు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్, మెయిల్ ద్వారా పంపిన చలాన్ సంబంధిత వాహన యజమానికి అందినట్లుగానే ప్రభుత్వం పరిగణిస్తుంది. ‘మాకు చలాన్ మెసేజ్ రాలేదు.. సమాచారం తెలియదు’ అని భవిష్యత్తులో వాహనదారులు తప్పించుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వం ఈ లూప్హోల్కు బ్రేక్ వేసింది. చలాన్ల పెండింగ్ వసూళ్లను వేగవంతం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



