రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు గానీ, హంగ్ ఏర్పడాలని తహతహలాడుతున్న బీజేపీ గానీ, ప్రణాళికల పేరుతో ప్రధానంగా ఓట్ల పథకాలే ప్రకటించాయి. బీజేపీ కులాన్ని, మతాన్ని కూడా ప్రయోగించింది. సాధారణ ప్రజల దైవభక్తిని కూడా ఓట్ల కోసం వాడుకుంటున్నది. అంతిమంగా ఈ మూడు పార్టీలు ప్రజల జీవితాల మీద దీర్ఘకాలిక ప్రభావం చూపే కీలక విషయాలను వదిలేసాయి. తిండి, బట్ట, ఇల్లు, విద్యా, వైద్యం లాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం వీరికి ఇష్టం లేదు. కమ్యూనిస్టులు మాత్రమే పేద ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాయి.
వ్యవసాయ కార్మికులకు అత్యంత కీలకమైంది భూమి సమస్య. భూసంస్కరణల ఊసే ఈ మూడు పార్టీల మ్యానిఫెస్టోల్లో కనిపించదు. పైగా రైతుబంధు పేరుతో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున భూస్వాములకు కూడా కట్టబెడుతున్నారు. కౌలురైతులకు గుర్తింపు కార్డుల విషయం విస్మరించాయి. దశబ్దాలుగా దున్నుకుంటున్న భూములు ఖాస్తుకాలం తొలగింపుతో నష్టపోయిన రైతుల ప్రస్తావన లేదు. ధరణి పేరు మారుస్తామంటున్నారు. సమస్య పేరుతో కాదు. రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. వీటన్నింటి మధ్య మద్దతు ధరను గాలికి వదిలేసారు. స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు జరపడం కీలకం. రాష్ట్రంలో కోటి మంది కార్మికుల కనీస వేతనాలు కూడా లేవు. సమాన పనికి సమానవేతనం అమలు కావడం లేదు. వలస కార్మిక చట్టం చెత్తబుట్టలో వేసారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చట్టాలు రద్దు చేసింది. ఇప్పటికే అనేక చోట్ల కార్మికులు రోజుకు 12 నుండి 15 గంటలు పనిచేయాల్సి వస్తున్నది. ఇవేవీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మ్యానిఫెస్టోలలో వెతికినా దొరకవు. విద్యా, వైద్యం అందని ద్రాక్షపండ్లయినాయి. నిర్బంద ఉచిత విద్య వీరి వాగ్దానాల్లో దొరకదు. కేరళలో లాగా తెలంగాణలో కూడా వందశాతం అక్షరాస్యత సాధిస్తామంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం కొన్ని గురుకుల పాఠశాలలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలన్నీ గాలికి వదిలేస్తే ఇది సాధ్యమా? కేంద్రంలో బీజేపీ సర్కార్ నూతన విద్యా విధానం ప్రకటించింది. దీనితో డబ్బున్నవారు తప్ప చదువుకునే అవకాశం దొరకదు. బడుగు, బలహీనవర్గాలు విద్యకు దూరమవుతాయి. ఇప్పటికే యూనివర్సిటీల్లో సాధారణ కోర్సుల స్థానంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేరుతున్నాయి. అంటే, వేలల్లో ఫీజులు చెల్లిస్తూ, హాస్టల్స్ సౌకర్యం లేకున్నా చదవగలిగే వారికి మాత్రమే యూనివర్సిటీ విద్య అందుబాటులో ఉంటుంది. ఈ మూడు పార్టీల మ్యానిఫెస్టోలు ఆరోగ్యశ్రీ లాంటి పథకాల గురించే చెప్పాయి. అంటే, మరిన్ని ప్రభుత్వ నిధులు కార్పొరేట్ సంస్థల బొజ్జల్లో చేరుతాయి. అదే డబ్బుతో ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ధి చేయాలనే సోయి లేదు. ఈ మూడు పార్టీలు ఇండ్ల పట్టాల గురించి, ఇంటి సౌకర్యం గురించి చెబుతున్నాయి. ఇప్పటికే వాగ్దానం చేసి మాట తప్పిన పార్టీలివి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామి నిధులు కోతబెట్టింది. ఈ పథకాన్ని పట్టణాలకు విస్తరించడం గురించి ఈ మూడు పార్టీలు నోరు విప్పలేదు. పోస్టుల భర్తీ గురించి ఆడిటన మాట తప్పింది బీఆర్‌ఎస్. ఈ సమస్యను సృష్టించింది కాంగ్రెస్. తన పరిధిలో 16లక్షల పోస్టులు భర్తీ చేయని కేంద్ర బీజేపీ నాయకులు రాష్ట్రంలో పోస్టుల భర్తీ గురించి మాట్లాడుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ గురించి వీరెవ్వరూ మాట్లాడడానికి సిద్దంగా లేరు. అసలు ఈ సమస్యలకు మూలం ప్రయివేటీకరణ కదా! ఈ మూడు పార్టీలు ప్రయివేటీకరణ విధానాలనే అమలు చేస్తున్నాయి. ఇక నిరుద్యోగ సమస్య పరిష్కారం ఎట్లా అవుతుంది? సమస్య సృష్టిస్తున్నదీ వీరే, పరిష్కరిస్తామంటున్నదీ వీరే. కనీసం పైసా ఖర్చులేని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కూడా వీరు ఒప్పుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు నిధుల గురించి, మహిళా, శిశు సంక్షేమం గురించి, వృద్ధుల సంక్షేమం గురించి వాగ్దానం చేస్తున్నారు. ఇది అలవాటైన పని. ఈ నిధులు డైవర్ట్ చేయకుండా, వీరికే ఖర్చుపెడతామన్న గ్యారంటీ మాత్రం వీరెవ్వరూ ఇవ్వటం లేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్‌ను రద్దు చేసి, పాత పద్దతిని అందరికీ అమలు జరుపుతామని చెప్పడానికి వీరు సిద్ధంగా లేరు. సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి కూడా ఈ మూడు పార్టీలు మాట్లాడవు. కుల వివక్ష, పురుషాధిక్యత ఊసే వీరెత్తరు. ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. వీటి కోసం పోరాడుతున్నది కేవలం కమ్యూనిస్టులే కదా! సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే ప్రజలకు అండగా నిలబడుతున్నదీ ఎర్రజెండానే కదా! అందుకే ఇప్పుడు శాసనసభలోకి కమ్యూనిస్టులను పంపడం అత్యంత ప్రాధానత్యను సంతరించుకున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్‌వాదులు మార్పు కావాలంటున్నారు. కాంగ్రెస్ కాలంనాటి పరిస్థితులు మళ్ళీ రావొద్దంటున్నారు బీఆర్‌ఎస్ నాయకులు. ఇంతకూ రావాల్సిన మార్పు ఏమిటి? ప్రభుత్వం మారితే చాలా? లేక విధానాలలో మార్పు రావాలా? ‘మార్పు’ అవసరాన్నే బీఆర్‌ఎస్ నాయకత్వం గుర్తించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విధానాలు మారుతాయా? మౌలికంగా ఈ రెండు పార్టీల విధానాల్లో తేడాలేదు. కొన్ని కనీస మార్పులైనా ఇప్పుడు కావాలి. శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య నెలకొల్పిన సంప్రదాయాలు నేటి తక్షణ అవసరం. వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలు, పదవులు, స్వార్థ రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజా సమస్యలపై గళమెత్తేవారు కావాలి. శాసనసభను ప్రజా సమస్యలపై చర్చావేదికగా మార్చగలిగేవారు కావాలి. ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడేవారు కావాలి. కమ్యూనిస్టులు శాసనసభలో అడుగుపెడితేనే కదా ఇది సాధ్యమయ్యేది? అందుకే తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టులను గెలిపించుకోవడం అవసరం.
సీపీఐ(ఎం) స్వతంత్రంగా పోటీచేయడం పైన కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను గెలిపించడానికేనా అంటున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న సీట్లలోనే ఎందుకు పోటీ చేయాలంటున్నారు. ఈ ప్రశ్నలు వేస్తున్నవారి చిత్తశుద్ధిని శంకించాలి. ఒకప్పుడు బీఆర్‌ఎస్‌ను భుజాన ఎత్తుకుని ఊరేగినవారే ఇప్పుడు సీపీఐ(ఎం) ఒంటరి పోటీని వక్రదృష్టితో చూస్తున్నారు. సీపీఐ(ఎం) చరిత్రలో ఇప్పుడు పోటీ చేస్తున్న సీట్లు కాకుండా, సిరిసిల్ల, గద్వాల లాంటి స్థానాలకు ఎప్పుడైనా పోటీ చేసిందా? తనకు బలమున్న చోటనే ఎప్పుడైనా పోటీ చేస్తున్నది. ఏ పార్టీయైనా తనకు బలమున్నచోటనే కదా పోటీ చేయవలసింది? ఇప్పుడు కాంగ్రెస్ కోసమో, బీఆర్‌ఎస్ కోసమో సీపీఐ(ఎం) పోటీ చేయకుండా ఎందుకుండాలి? తనను తాను ఫణంగా పెట్టుకుని వారినెందుకు గెలిపించాలి? ప్రజాస్వామ్య విలువల విషయంలో కూడా ఈ రెండు పార్టీలకు తేడాలేదు. బీఆర్‌ఎస్ నాయకత్వం పోరాటాల పట్ల అసహనం, అహంభావం ప్రదర్శిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముదిగొండ కాల్పుల్లో ఏడుగురిని బలితీసుకున్నది. ప్రజా ఉద్యమాల పట్ల ఇద్దరిదీ ఒకే ధోరణి. ఇక ఒకట్రెండు సీట్ల కోసం కాంగ్రెస్‌తో సర్దుబాట్లు ఎందుకు తెంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న అడగవలసింది కాంగ్రెస్‌ను కదా? వామపక్షాలకు వస్తే ఒకట్రెండు సీట్లు మాత్రమే. ఈ సర్దుబాటుకు అంగీకరిస్తే వారికి అధికారం కదా వచ్చేది? ఒక రాజకీయ పార్టీ కోసం మరొక పార్టీ తన మనుగడనే కోల్పోవాలని చెప్పేవారి విజ్ఞతకు సంబంధించిన సమస్య ఇది. అయినా సీపీఐ(ఎం) ఒక సూత్రబద్ద వైఖరి తీసుకున్నది. బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో దానిని ఓడించగలవారికి మద్దతునివ్వాలని నిర్ణయించింది. కొత్తగూడెంలో సీపీఐ, పినపాకలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, శేరిలింగంపల్లిలో ఎంసీపీఐ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో స్థానిక పరిస్థితులను బట్టి ప్రజాతంత్ర, సామాజిక, లౌకిక శక్తులను ఎంపిక చేసి ఎవరికి మద్దతునివ్వాలో జిల్లా కమిటీలు నిర్ణయించాయి.
ఉన్నట్టుండి చివరి మూడు రోజుల్లో బీజేపీ హడావుడి పెంచింది. నువ్వానేనా అన్న తరహాలో సాగుతున్న ఎన్నికల బరిలో మూడో, నాలుగో మళ్ళీ గెలిచి కింగ్‌మేకర్ కావాలని కలలు కంటున్నది. కానీ తెలంగాణ ప్రజలు ఎవరికో ఒకరికి పూర్తి మెజారిటీ ఇచ్చే అవకాశాలే ఎక్కువ. బీజేపీ కలలు కల్లలు కాక తప్పదు. ఎస్సీ వర్గీకరణ కోసం తాను కూడా పోరాడుతానని ప్రధానమంత్రి అన్నారు. ఎవరితో పోరాడుతారు? తామే కదా ఈ సమస్యను పరిష్కరించాల్సింది? మూడేండ్లుగా సుప్రీంకోర్టులో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నించలేదు. పైగా అలాంటి బెంచ్ ఏర్పిడినా ఇవ్వబోయే తీర్పు ఎట్లా ఉంటుందో కూడా చెప్పలేము. తమకు కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్నది. వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారమిస్తూ చట్టసవరణ చేయవచ్చు. ఆ పని చేస్తానని మాత్రం ఆయన చెప్పలేదు. మరో కమిటీ వేస్తానని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇంతకంటే మోసపూరితమైన వాగ్దానం ఇంకేముంటుంది? ఎన్నికల కమిషన్ వైఖరి కూడా అనుమానాస్పదం. బీజేపీ నాయకులు మతపరమైన విభజన సృష్టించేందుకు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నప్పటికీ, వీరు జోక్యం చేసుకోలేదు. కానీ, మహబూబాబాద్‌లో గుడిసెవాసుల జీవితాలతో చెలగాటమాడుతున్న శాసనసభ్యుడు శంకర్‌నాయక్ దౌర్జన్యాలను ఖండించాలని సీపీఐ(ఎం) కరపత్రం వేయాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. ఆ కరపత్రంలో ఎన్నికల ప్రస్థావన కూడా లేదు. అయినా ఆయనపేరు పెట్టొద్దట! పేదలమీద ఆయన పెట్టించిన కేసుల గురించి రాయవద్దట! ఇదెక్కడి న్యాయం? ఎన్నికల్లో కూడా పలనా పార్టీ అనే కాదు, పలనా అభ్యర్థిని ఓడించండని కూడా చెబుతాము కదా! పేరు ప్రస్తావించవద్దనడంలో అర్థమేమిటి? ఇది అధికారుల నిజాయితీపైనే అనుమానం కలిగిస్తున్నది. అభ్యంతరకరమైన భాష వాడొద్దంటే అర్థం చేసుకోవచ్చు. ఏమైనా మిగిలింది రెండు రోజులే. ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి. కమ్యూనిస్టులను గెలిపించాలి. శాసనసభకు పంపాలి. ఇదే నేటి తక్షణ అవసరం.
ఎస్. వీరయ్య