ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ప్రధానోపాధ్యాయుడు సోమయ్య
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని నైనాల గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమయ్య తెలిపారు. శనివారం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిబాట కార్యక్రమంపై అవగాహన కల్పించాడు. ఈ సందర్భంగా ఆయన.ఇంటింటికి తిరిగి బడిబాట కార్యక్రమం చేసే సమయంలో తల్లిదండ్రులు వారి ఉపాధి హామీ పథక పనులలో నిమగ్నమై ఉన్నందున ఉపాధ్యాయులే వారి వద్దకు వెళ్లి, ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యత, నైనాల పాఠశాలలో చేరితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయుడు రాంబాబు మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దే విధంగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పంపి ఖర్చుల పాలు కాకుండా మన ఊరి ప్రభుత్వ బడికి పిల్లలను పంపాలని కోరారు. అదేవిధంగా ఉపాధ్యాయుడు రాజు మాట్లాడుతూ మన పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, స్కూల్ యూనిఫారం, రుచికరమైన మధ్యాహ్న భోజన సదుపాయాలను కల్పించి, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా వర్క్ బుక్కులు కూడా అందిస్తోందని చెప్పారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని, దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల నైనాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.



