అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాపిత ” సార్వత్రిక సమ్మె ” లో వ్యవసాయ కార్మికులు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ఒక ప్రకటన ద్వారా కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మె కేవలం ఒక నిరసన కాదని ఇది ప్రజల బతుకుల కోసం మోదీ విధానాలపై ప్రజా తిరుగుబాటని తెలిపారు.
ప్రధానంగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కొత్త ఉపాధి చట్టం విబి – జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు -2025 రద్దు చేయాలని, నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్.డి.ఐ ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటీకరించరాదని, సంఘటిత, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాలని, ఉపాధి హామీ పనిని సంవత్సరానికి 200 రోజులకు పెంచి, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్స్ సాధన కోసం ఈ సమ్మె నిర్వహిస్తున్నామని అన్నారు.
ఇది కేవలం ఉపాధి కోసం పోరాటం కాదని, ప్రజాస్వామ్యం కోసం, దేశ భవిష్యత్తు కోస మని ఈ సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలి నర్సింహ పిలుపునిచ్చారు.



