మంగళూరు: అన్‌రిజర్వడ్ టిక్కెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) యాప్‌ను మార్చి 1 నుంచి దశలవారీగా రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. కాబట్టి ప్రయాణీకులు వీలైనంత త్వరగా రైల్‌వన్ యాప్‌కు మారాలని కోరింది. రైల్‌వన్ యాప్‌లోకి సైన్ ఇన్ చేయడానికి ఇప్పటికే వున్న ఐఆర్సీటీసీ, యూటీఎస్ ఆధారాలను ఉపయోగించవచ్చునని తెలిపింది. టిక్కెట్ల బుకింగ్, రైళ్ల ట్రాకింగ్, ఆహార సేవలు, ఫిర్యాదులకు షరిష్కారం.. వంటి అన్ని అంశాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకునిరావడానికే రైల్‌వన్ యాప్‌ను తీసుకొచ్చినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైల్‌వన్ యాప్‌లో రైలు నడుస్తున్న స్థితి, రైలు ఆలస్యం, బయలుదేరే సమయం, రైలు వచ్చే ఫ్లాట్‌ఫామ్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. అలాగే, పీఎన్ఆర్ స్థితి, టిక్కెట్ల క్యాన్సిలెషన్, నగదు వాపసు స్థితిని పర్యవేక్షించుకోవచ్చునని చెప్పింది. కాగా, మరోవైపు యూటీఎస్ యాప్‌లో ఇప్పటికే సీజన్ టికెట్ బుకింగ్, పునరుద్ధరణ, నూతన యూజర్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు.



