నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో 1999 నుండి 2004 మధ్యకాలంలో ఉద్యోగం పొందిన విద్యుత్ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న విధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ భువనగిరి డివిజన్ అధ్యక్షులు మీర్జా షకీల్ బేగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీరిలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ గుర్తింపు లేకుండానే 15–20 సంవత్సరాల పాటు ప్రమాదకర పరిస్థితుల్లో విద్యుత్ పనులు నిర్వహిస్తూ, గుంటలు తవ్వుతూ, విద్యుత్ స్తంభాలు నాటుతూ, ప్రాణాలకు తెగించి మారుమూల పల్లెటూర్లకు వెలుగులు తీసుకువచ్చిన కార్మికులే ఈ విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లు. ప్రజాసేవే లక్ష్యంగా తక్కువ వేతనంతో సంవత్సరాల పాటు పనిచేసిన వీరిని 2002 ప్రాంతంలో అధికారికంగా ఉద్యోగాల్లోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
అయితే అప్పటికే చాలామంది 40–45 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరడం వల్ల తగిన సర్వీసు కాలం లేక పెన్షన్ హక్కు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. “పెన్షన్ అనేది దయ కాదు, రాజ్యాంగ హక్కు” అని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21ల ప్రకారం మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి చేసిన సేవలకు ఆలస్యంగా చెల్లించే వేతనం అని గుర్తుచేశారు. 1999 తరువాత విద్యుత్ శాఖలో పెన్షన్ విధానం రద్దు చేయడం, అదే పనులు చేసిన ఉద్యోగులను కేవలం తేదీ కారణంగా పెన్షన్ నుంచి దూరం చేయడం స్పష్టమైన వివక్షాత్మక విధానం అని ఆయన విమర్శించారు.
రిటైర్మెంట్ అనంతర దయనీయ పరిస్థితి
2021 నుండి రిటైర్ అవుతున్న ఈ ఉద్యోగులకు: నెలవారీ పెన్షన్ లేకపోవడం ఈపీఎఫ్ ద్వారా కేవలం సుమారు రూ.2000 మాత్రమే అందడం వైద్య భద్రత లేకపోవడం వృద్ధాప్యంలో ఆదుకునే ఆర్థిక భరోసా లేకపోవడం
వల్ల జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం రోజువారీ ఖర్చులు, మందులు, వైద్య చికిత్స, కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెన్షన్ లేకపోవడం వల్ల రిటైర్ అయిన ఉద్యోగులు తమ కుటుంబాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుమారు 400 మంది ఉద్యోగులు రిటైర్ కాగా, రాబోయే కాలంలో దాదాపు 2500 మంది ఉద్యోగులు రిటైర్ కావాల్సి ఉందని, వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి డిమాండ్లు
రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృష్టితో స్పందించి: 1999 నుండి 2004 వరకు నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం లేదా ప్రత్యేక పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకు కనీస సామాజిక భద్రత కల్పించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు / ఆరోగ్య బీమా అందించాలి. గ్రామాలకు వెలుగులు నింపిన కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరారు.



