Tuesday, June 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిజాబ్ లెస్ గ్రోత్ లెస్ కు 'జంతర్ మంతర్` జవాబు

జాబ్ లెస్ గ్రోత్ లెస్ కు ‘జంతర్ మంతర్` జవాబు

- Advertisement -

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన యువత నిరసనలు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, కొరవడుతున్న ఉపాధి, ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం, ఉన్నత విద్య, ఉద్యోగాల పరీక్షల నిర్వహణలో వైఫల్యం, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోవడం వంటి సమస్యలపై నివురుగప్పిన నిప్పులా పేరుకున్న అసంతృప్తికి ప్రతీకగా ఎగిసిపడిన ఆగ్రహ జ్వాలగా నిలిచాయి. ఈ నిరసన జ్వాలను కేవలం పరీక్షల లీకేజీలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనగా మాత్రమే చూడటం సరైంది కాదు. ఇది గత పన్నెండేళ్లుగా దేశంలో అమలవుతున్న ఆర్థిక, మతోన్మాద రాజకీయ విధానాల ఫలితంగా ఏర్పడిన సామాజిక, ఆర్థిక సంక్షోభానికి యువత ఇచ్చిన రాజకీయ ప్రతిస్పందన. 2014 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. ఆ లెక్కన 2014 నుండి 2026 వరకు దాదాపు 24 కోట్ల ఉద్యోగ అవకాశాలు సృష్టించాల్సి ఉంది. కానీ నేడు దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం యువత పడుతున్న కష్టాలు చూస్తే ఆ హామీ ఎంతవరకు అమలైందో అర్థమవుతుంది. లక్షలాది మంది యువకులు సంవత్స రాల తరబడి కోచింగ్ సెంటర్లలో పస్తులుండి కూడా చదువుతూ, పరీక్షల కోసం పడిగాపులు కాస్తూ తమ జీవితంలోని అత్యంత విలువైన కాలాన్ని కొవ్వొత్తిలా కరిగిస్తున్నారు.

ప్రభుత్వం విడుదల చేస్తున్న పిఎల్‌ఎఫ్‌ఎస్‌ గణాంకాలు నిరుద్యోగ రేటు తగ్గిందని చెబుతున్నప్పటికీ, ఉపాధి నాణ్యత గురించి అవి పూర్తి చిత్రాన్ని చూపడం లేదు. 2023-24 సంవత్సరానికి 15–29 ఏళ్ల యువతలో నిరుద్యోగ రేటు 10.2 శాతంగా నమోదైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), భారత మానవ అభివృద్ధి సంస్థ (ఐహెచ్‌‌డి) సంయుక్తంగా విడుదల చేసిన ‘‘ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024’’ ప్రకారం దేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో సుమారు 82.9 శాతం మంది యువతే ఉన్నారని వెల్లడించింది. అలాగే చదువుకున్న యువతలో నిరుద్యోగం మరింత తీవ్రంగా ఉందని, 2000లో 23.9 శాతంగా ఉన్న చదువుకున్న యువత నిరుద్యోగం 2019 నాటికి 30.8 శాతానికి చేరిందని నివేదిక పేర్కొంది. యువత పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మరో గణాంకం తెలియజేస్తోంది. ఐఎల్‌ఓ అంచనాల ప్రకారం 2024లో భారతదేశ యువత (15–24 సంవత్సరాలు) నిరుద్యోగ రేటు సుమారు పదహారు శాతంగా ఉంది. అంటే ప్రతి ఆరుగురు యువకులలో ఒకరు ఉద్యోగం లేకుండా ఉన్నారని అర్థం. అయితే అధికారిక గణాంకాలు, సిఐఐఈ వంటి స్వతంత్ర సంస్థల అంచనాల మధ్య వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఈ వ్యత్యాసాలు భారత ఉపాధి పరిస్థితిపై కొనసాగుతున్న చర్చకు కారణమవుతున్నాయి.

ఉద్యోగాల సమస్యతో పాటు ప్రభుత్వ నియామకాల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. వివిధ పార్లమెంటు సమాధానాలు, ప్రభుత్వ నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ కాలాల్లో ఎనిమిది లక్షల నుండి పది లక్షల వరకు ఖాళీలు ఉన్నట్లు వెల్లడైంది. రైల్వేలు, రక్షణ శాఖ, పోస్టల్ విభాగం, కేంద్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, న్యాయవ్యవస్థలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు కోట్లాది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు ప్రభుత్వ ఖాళీలు భర్తీ కాకపోవడం పాలకుల ప్రాధాన్యతలను ప్రశ్నించే అంశం.
ఇదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ప్రచారం పొందుతోంది. జీడీపీ పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. కానీ ఈ వృద్ధి ఉద్యోగాలుగా మారడం లేదు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం 2012 నుండి 2019 మధ్య భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల విలువ జోడింపు (జివిఎ) సగటున 6.7 శాతం చొప్పున పెరిగినప్పటికీ, అదే కాలంలో ఉపాధి వృద్ధి కేవలం 0.01 శాతం మాత్రమే నమోదైంది. అంటే ఆర్థిక వృద్ధి జరిగింది కానీ ఉద్యోగాలు సృష్టించబడలేదు. దీనినే ఆర్థికవేత్తలు ‘‘జాబ్‌లెస్ గ్రోత్’’గా పేర్కొంటున్నారు.

మరోవైపు దేశంలో సంపద కేంద్రీకరణ వేగంగా పెరిగింది. గత పదేళ్లలో దేశంలోని అగ్రశ్రేణి కార్పొరేట్ వర్గాల సంపద అపూర్వంగా పెరిగింది. ముఖ్యంగా గౌతమ్ అదానీ మరియు ముకేష్ అంబానీ వంటి బిలియనీర్ల సంపద ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైంది. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య, వారి మొత్తం సంపద గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. అదే సమయంలో నిరుద్యోగం, అస్థిర ఉపాధి, రైతుల అప్పులు, కార్మికుల కనీస వేతనాల పెరుగుదల మందగించడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. 2019లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించింది. ఇప్పటికే ఉన్న కంపెనీల పన్ను రేటును 30 శాతం నుండి 22 శాతానికి, కొత్త తయారీ సంస్థల పన్ను రేటును 25 శాతం నుండి 15 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి సుమారు లక్ష కోట్ల రూపాయల ఆదాయ నష్టం వాటిల్లిందని అంచనాలు వెలువడ్డాయి. ఈ పన్ను తగ్గింపులు పెట్టుబడులు, ఉద్యోగాలు పెంచుతాయని ప్రభుత్వం వాదించింది. అయితే ఆ తరువాత కాలంలో ఉద్యోగాల పెరుగుదల అదే స్థాయిలో కనిపించలేదని అనేక విశ్లేషణలు సూచించాయి. 2024లో విడుదలైన ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ మరో కీలక అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. దేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో 82.9 శాతం మంది యువతే ఉన్నారని నివేదిక పేర్కొంది. అంటే నిరుద్యోగ సమస్య ప్రధానంగా యువత సమస్యగా మారిందని అర్థం. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు; సామాజిక స్థిరత్వం, కుటుంబాల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ, ప్రజాస్వామిక వ్యవస్థలపై కూడా ప్రభావం చూపే అంశం.

ఈ పరిస్థితిని సరైన దృక్పథంతో పరిశీలిస్తే సమస్య మూలాలు స్పష్టమవుతాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి లక్ష్యం మానవ అవసరాలను తీర్చడం కాదు; లాభాలను గరిష్ట స్థాయికి తీసుకెళ్లడం. అందుకే ఆటోమేషన్, కాంట్రాక్టు విధానం, అవుట్‌సోర్సింగ్, గిగ్ ఎకానమీ వంటి పద్ధతులు విస్తరిస్తు న్నాయి. కార్మికుల సంఖ్య తగ్గించి లాభాలను పెంచడం పెట్టుబడిదారీ వ్యవస్థ సహజ ధోరణి. ఫలితంగా సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, అస్థిర ఉపాధి, నిరుద్యోగం, అసమానతలు పెరుగుతున్నాయి.దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా బలపడాలంటే స్టాక్ మార్కెట్లు పెరిగితేనే సరిపోదు. యువతకు గౌరవప్రదమైన ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ విస్తరణ, ఖాళీ పోస్టుల భర్తీ, విద్య మరియు ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు, కార్మిక హక్కుల రక్షణ, సమాన అవకాశాలు కల్పించడం అవసరం. లేకపోతే జంతర్ మంతర్‌లో వినిపించిన స్వరం రేపు దేశవ్యాప్తంగా మరింత శక్తివంతమైన ఉద్యమంగా మారే అవకాశం ఉంది.
విజయ్‌ పుట్టపాగ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -