ఒకప్పుడు దేశద్రోహిగా ముద్రపడాలంటే పెద్ద నేరం చేసిన వారై ఉండాలి. సరిహద్దులు దాటి శత్రుదేశ రహస్యాలు చేరవేయడం, లేదా దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం లాంటి భారీ పనులు చేసిన వారిని దేశద్రోహిగా చిత్రీకరించేవారు. కానీ ఈ ఆధునిక డిజిటల్ యుగంలో దేశభక్తిని నిరూపిం చుకోవడం ఎంత కష్టమో, దేశద్రోహిగా ముద్ర వేయించుకోవడం అంతకంటే సులువు. మీ పాస్‌పోర్ట్, వీసా, ఆధార్ కార్డులతో పనిలేదు. కేవలం ఒకే ఒక్క తప్పుడు ప్రశ్న మీ జీవితాన్నే మార్చేయగలదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలను, ప్రజా సమస్యలను ప్రశ్నించడం అనే ఒకే ఒక్క ‘తప్పు’ చేస్తే చాలు, సోషల్ మీడియా చౌరస్తాలో క్షణాల్లో మీపై ఒక బ్రాండ్ ముద్ర పడిపోతుంది. ఉదాహరణకు, మీరు పన్నెండవ తరగతి పరీక్షా పత్రంలో అడిగిన ఒక తప్పుడు ప్రశ్న గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చించారనుకుందాం. మరుసటి రోజు ఉదయానికల్లా ‘వాట్సాప్ యూనివర్సిటీ’ మిత్రులు రంగంలోకి దిగి, మీ ప్రొఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మీరు పన్నెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసిన ఏదోఒక చిన్న తప్పును వెతికి పట్టుకుంటారు.
సాయంత్రా నికల్లా టీవీ ఛానెళ్లలో మీ ఫోటో వేసి, దీని వెనుక ఏదో అంతర్జా తీయ కుట్ర దాగి ఉందని, మీ ఆలోచనల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందో లేదో దర్యాప్తు చేయాలని గంభీరంగా చర్చిస్తారు. యాంకర్ తన గొంతును నాలుగో శృతికి పెంచి, దేశ రక్షణ గురించి ఆవేశంగా మాట్లాడు తుంటే, పాపం ఆ పన్నెండవ తరగతి విద్యార్థి తను అడిగింది కేవలం మార్కుల గురించే కదా అని తల పట్టుకుంటాడు. ఈ రోజుల్లో దేశభక్తిని కొలిచే మీటర్లు చాలా విచిత్రంగా మారాయి. ఎవరైనా రోడ్ల మీద గుంతల గురించి అడిగితే, తక్షణమే వారికో పాకిస్తానీ ముద్ర వేసి సరిహద్దు దాటించే ఏర్పాట్లు జరుగుతాయి. ఒకవేళ మీరు నిరుద్యోగం గురించి మాట్లాడితే, ‘టీ కప్పులో తుఫాను’ సృష్టించడమే మీ పని అని తేల్చేస్తారు. ధరల పెరుగుదల గురించి ప్రశ్నిస్తే, ‘ఇదంతా దేశ ప్రగతి కోసం భరించాల్సిన చిన్న త్యాగం’ అనే తాత్విక సమాధానం లభిస్తుంది. మన దేశంలోని కొన్ని శక్తులకు ‘పాకిస్తాన్’ అనే పదం ఒక మంత్రదండం లాంటిది. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రశ్న ఎదురైనా, ఈ పదాన్ని ప్రయోగిస్తే చాలు, నిమిషాల్లో ఆ సమస్య మాయమై పోతుంది, ప్రశ్న అడిగినవాడు నోరు మూసుకుంటాడు.
క్రీడల రంగంలోనైతే ఈ దేశభక్తి వ్యాపారం మరీ పరాకాష్టకు చేరుకుంది. భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అది కేవలం ఒక ఆట కాదు, అదొక భారీ జాతీయ సెంటిమెంట్ వ్యాపారం. ఇరు దేశాల్లోని ద్వేష భావాలను, భావోద్వే గాలను క్యాష్ చేసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు సిద్ధంగా ఉంటాయి. మ్యాచ్ సమయంలో ప్రసారమయ్యే ప్రకటనల రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. ద్వేషాన్ని ఎలా అమ్మాలో, దాన్నుంచి కోట్ల రూపాయల లాభాలను ఎలా పిండాలో ఛానెళ్లకు బాగా తెలుసు. ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉంటాయని చెప్తూనే, మరోవైపు అదే ఉద్రిక్తతలను టీఆర్పీ రేటింగుల కోసం వాడుకునే ఈ డబుల్ స్టాండర్డ్స్ నిజంగా అద్భుతం. రాజకీయ నాయకులకు, టీవీ యాంకర్లకు కూడా ఈ ‘ప్రశ్నల నిరోధక వ్యాక్సిన్’ బాగా అలవాటైపోయింది. ప్రతిపక్షాలు రక్షణ విధానాల గురించి లేదా విదేశాంగ విధానం గురించి ఏవైనా లోతైన ప్రశ్నలు వేస్తే, వెనువెంటనే స్టూడియోల్లో కూర్చున్న మేధావులు రంగంలోకి దిగుతారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం పక్కన పెట్టి, ప్రశ్న వేసిన వారి దేశభక్తిని శంకిస్తారు. ‘మీకు అసలు దేశం మీద ప్రేమ ఉందా? సరిహద్దుల్లో సైనికులు రక్తం చిందిస్తుంటే మీరు ఇక్కడ కూర్చుని ప్రశ్నలు అడుగుతారా?’ అంటూ భావోద్వేగాలను రెచ్చగొడతారు. దీంతో అసలు సమస్య అక్కడికక్కడే అటకెక్కుతుంది.
ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయానికి వస్తే, సామాన్యుడి పరిస్థితి వర్ణనా తీతం. నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే, మధ్యతరగతి ఇళ్లలో పొయ్యి వెలగడం గగనమైపోతోంది. కానీ దీనిపై ఎవరైనా గొంతు విప్పితే, వెంటనే ఒక ఉచిత సలహా వస్తుంది: ‘ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి, దేశ ప్రగతికి మనం సహకరించాలి. అసలు రోడ్ల మీద వాహనాలు తగ్గి కాలుష్యం తగ్గడానికే ప్రభుత్వం ధరలు పెంచుతోంది!’ అనే వింత వాదనలు తెరపైకి వస్తాయి. ధరలు పెరగడం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, వారు దేశం కోసం ఈ భారాన్ని చిరునవ్వుతో మోస్తున్నారని నిరూపించేందుకు పరిశో ధనలు కూడా జరుగుతాయి. ప్రజలు నిశ్శబ్దంగా భరించడమే పరమ పవిత్రమైన దేశభక్తిగా ప్రచారం చేయబడు తోంది. ఇలాంటి వాతావరణంలో సాధారణ పౌరుడు ప్రశ్న అడగాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇంట్లో కరెంట్ పోయినా, విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేయాలంటే వందసార్లు ఆలోచించాల్సి వస్తోంది.
‘ఎక్కడ నేను కరెంట్ గురించి అడిగితే నన్ను దేశ వ్యతిరేకిగా ముద్రిస్తారో, నా ఇంటర్నెట్ కనెక్షన్‌ను కట్ చేస్తారో’ అనే భయం పట్టుకుంది. నేటి సమాజంలో పౌరుడికి ఉండకూడని ఏకైక లక్షణం ‘ప్రశ్నించడం’. పాలకులు ఏం చేసినా కళ్ళు మూసుకుని తల ఊపడం, ఛానెళ్లు చెప్పే అబద్ధాలను నిజాలుగా నమ్మడం, సమస్యలను చూసి చూడనట్లు నవ్వుతూ సాగిపోవడమే నేటి ఆదర్శ పౌరుడి లక్షణాలుగా మారుతున్నాయి. ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే ఈ సంస్కృతి కొనసాగితే, భవిష్యత్తులో నిఘంటువుల నుండి ‘ప్రశ్న’ అనే పదమే మాయమైపోయినా ఆశ్చర్యపో నక్కర్లేదు. కాబట్టి సోదరులారా, సుఖంగా జీవించాలనుకుంటే ఒక్కటే సూత్రం: ‘సరిహద్దుల గురించి మాట్లాడండి, సెంటిమెంట్ల గురించి చర్చించండి, కానీ పొరపాటున కూడా ప్రజా సమస్యల గురించి మాత్రం… ‘సవాల్ మత్ పూచ్‌నా’ (ప్రశ్న అడగొద్దు), సంఝే!
ఎం.డి. ఉస్మాన్‌ఖాన్
ప్రశ్నలొద్దు…భజనలు ముద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



