Tuesday, June 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమానని ‘మణిపూర్‌’ గాయం!

మానని ‘మణిపూర్‌’ గాయం!

- Advertisement -

జాత్యాహంకార ఘర్షణలతో మూడేండ్ల నుంచి మండుతున్న మణిపూర్‌లో మంటలు చల్లారడం లేదు. ఇటీవల ఒక్కసారిగా మళ్లీ అశాంతి చెలరేగింది. ఇటీవల గుర్తుతెలియని దుండగుల దాడుల్లో ముగ్గురు కుకీలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ముమ్మాటికీ మైతీలు చేసిన హత్యలేనని కుకీలు ఆరోపించారు. రెండు తెగల మధ్య ప్రారంభమైన వైరం దేశ రాజకీయాలనే ప్రభావితం చేసింది. ఇక్కడ మరో ఆందోళనకరమైన అంశం, ఇద్దరు మహిళ కుకీలను వివస్ర్తలు చేసి నడిపించిన ఘటన. ఇది సభ్య సమాజాన్నే తలదించుకునేలా చేసింది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ‌కేంద్ర, రాష్ట్ర పాలకులు గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే, నేటికీ అలాంటి అమానవీయ ఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో చట్టపరమైన రక్షణ వ్యవస్థ ఎంతగా దెబ్బతిందో తెలియజేస్తోంది. ఇది బీజేపీ పాలనా వైఫల్యానికి నిదర్శనం. మణిపూర్ సంక్షోభాన్ని కేవలం తాజా ఘటనలతో అర్థం చేసుకోలేము. దాని వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది.

లోయ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉండే మైతీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ-జో- నాగ తెగల మధ్య భూ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, అటవీ వనరులు, పరిపాలనా అధికారాల విషయంలో చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. అయితే 2023లో మైతీలకు షెడ్యూల్‌ ట్రైబ్‌ ‌హోదా కల్పించాలని వచ్చిన డిమాండ్‌ ‌నేపథ్యంలో మొదలైన వివాదం క్రమంగా జాతి ఘర్షణగా మారి రక్తపాతానికి దారితీసింది. సున్నితంగా పరిష్కరించాల్సిన సమస్యను ప్రభుత్వం భద్రతా సమస్యగా చూపింది. కానీ, దీనివెనుక కేంద్ర సర్కార్‌ ‌కుట్ర దాగుంది. కుకీలున్న కొండ ప్రాంతాల్లో నిలువైన ఖనిజ నిక్ష‍ేపాలను బడా పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలను కట్టబెట్టే ప్రయత్నంలో రెండు తెగల మధ్య చిచ్చు రాజేసింది. కుకీలను అక్కడి నుంచి తరిమేయాలని పథకం వేసింది. ఫలితంగా ఇప్పుడు రాష్ట్రమే ‌రెండు భాగాలు చీలిపోయి, రావణకాష్టంలా మండుతోంది.

ఈ ఘర్షణలో ఇప్పటివరకు రెండు వందల యాభైకి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదివేల ఇళ్లు తగులబడ్డాయి. దాదాపు అరవై వేల మంది నిరాశ్రయులయ్యారు. సాధారణ ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. అనేక కుటుంబాలు ఇప్పటికీ సహాయక శిబిరాల్లోనే జీవిస్తున్నాయి. అక్కడ హింస చెలరేగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ముఖ్యమంత్రి బీరెన్‌‌సింగ్‌ ‌మెయితీ వర్గానికి అనుకూల వైఖరి తీసుకోవడం సమస్యను జటిలం చేసింది. కుకీల విశ్వాసాన్ని కోల్పోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం కొద్దికాలం రాష్ట్రపతి పాలన కొనసాగింది. ముఖ్యమంత్రిని మార్చడం, రాష్ట్రపతి పాలన విధించడం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. నేటికీ హత్యలు, దాడులు, నిరసనలు కొనసాగుతుండటం సంక్షోభం పరిపాలనా స్థాయిని దాటి, రాజకీయ, సామాజిక స్థాయికి చేరుకుంది. ఇదంతా చూసినప్పుడు బీజేపీ తరచూ ప్రచారం చేసే “డబుల్ ఇంజన్‌” సర్కార్‌ మణిపూర్‌లో పూర్తిగా బోల్తా పడింది.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభి‌వృద్ధి, శాంతి, సమన్వయం మెరుగ్గా ఉంటా యని చెప్పిన బీజేపీ, మణిపూర్ ప్రజలకు కనీస భద్రతను కూడా కల్పించలేక పోయింది. రాష్ట్రం నెలల తరబడి అగ్నిగుండంలా మారినా ప్రధాని ఆ సమయంలో విదేశాల్లో పర్యటించడం, ప్రత్యక్ష‍ జోక్యం లేకపోవడం పట్ల ప్రతిపక్ష‍ాల నుంచి తీవ్రమైన నిరసన గళం వినిపించింది. పార్లమెంట్‌‌లో చర్చకు పట్టుబట్టింది. అయినప్పటికీ బాధిత ప్రాంతాలను సందర్శించడంలో కేంద్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని నేటికీ రాజకీయ విశ్లేషకుల విమర్శ. ఈ సంక్షోభంలో అత్యంత ఆందోళనకరమైన అంశం జాతి, మత, ప్రాంతీయ గుర్తింపులను రాజకీయంగా వినియోగించే ధోరణి. ప్రజల మధ్య ఉన్న భిన్నత్వాన్ని గౌరవించి ఐక్యతను పెంపొందించాల్సిన పాలకులు దాన్ని విస్మరించడం. మణిపూర్‌‌లో క్రైస్తవాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్న ఆదివాసీ కుకీలపై అన్యమత ప్రచారంతో రెచ్చగొట్టడం పాలకుల విభజన రాజకీయాన్ని బహిర్గతం చేసింది.

ఒక వర్గం భయాలను మరో వర్గంపైకి మళ్లించడం, సామాజిక విభేదాలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకోవడం తాత్కాలికంగా ఓట్లు తెచ్చిపెట్టవచ్చు. కానీ చివరకు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మణిపూర్‌లో నేడు కనిపిస్తున్న పరిస్థితి అదే. పక్కపక్కనే నివసించిన ప్రజలు ఒకరినొకరు అను మానంతో చూసే స్థితికి చేరుకున్నారు. సామాజిక సంబంధాలు తెగిపోయాయి. ఇది కేవలం మణిపూర్‌కే పరిమితమైన సమస్య కాదు, దేశ సమైక్యతకు ముప్పు. భారతదేశం అనేక జాతులు, మతాలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనమన్న విషయాన్ని పాలకులు మరవరాదు. ఈ వైవిధ్యమే మన దేశ బలం. దాన్ని రాజకీయ లాభాల కోసం విభజనకు ఆయుధంగా మారిస్తే దేశ భవిష్యత్తుకే ప్రమా దకరం. మణిపూర్ మంటలు హెచ్చరించేది అదే. ద్వేషం, విద్వేషం, విభజన రాజకీయాలు చివరకు ప్రజల ప్రాణాలను బలిగొంటాయి. దేశం ఈ విషయాన్ని విస్మరిస్తే, మణిపూర్ లాంటి విషాదాలు మళ్లీమళ్లీ పునరావృతమవుతూనే ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -