Tuesday, June 9, 2026
E-PAPER
Homeఆటలుఅదిరే విజయం

అదిరే విజయం

- Advertisement -

ఇన్నింగ్స్‌ 300 పరుగులతో గెలుపు
మూడు రోజుల్లోనే చేతులెత్తేసిన అఫ్గాన్‌
1-0తో టెస్టు సిరీస్‌ 
భారత్‌ వశం

అఫ్గనిస్తాన్‌పై భారత్‌ అదిరే విజయం సాధించింది. ఏకైక టెస్టులో ఆ జట్టుపై ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో టెస్టు క్రికెట్‌లోనే అతిపెద్ద విజయం ఖాతాలో వేసుకుంది. అరంగేట్ర లెఫ్టార్మ్‌ స్పిన్నర్న్‌ మానవ్‌ సుతార్‌ ఆరు వికెట్ల ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్‌ 152 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఫాల్‌ఆన్‌లో ఆ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 564 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 1-0తో టెస్టు సిరీస్‌ టీమ్‌ ఇండియా సొంతం చేసుకుంది.

​నవతెలంగాణ-న్యూ చంఢీగడ్‌
అరంగేట్ర స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (6/33, 1/29) మాయాజాలంతో అఫ్గనిస్తాన్‌లో ఏకైక టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా టెస్టుల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. మానవ్‌ సుతార్‌ ఆరు వికెట్ల మాయతో తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గనిస్తాన్‌తో 58.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ప్రసిద్‌ కృష్ణ (3/37) మూడు వికెట్లతో మెరిశాడు. అఫ్గాన్‌ బ్యాటర్‌ రెహమత్‌ షా (60, 135 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఫాలోఆన్‌లో అఫ్గనిస్తాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కుప్పకూలింది. స్పిన్నర్లు వాషింగ్టన్‌ సుందర్‌ (4/36), కుల్‌దీప్‌ యాదవ్‌ (3/30) మాయతో అఫ్గాన్‌ 35.5 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 564 పరుగులు చేయగా.. మరోసారి బ్యాట్‌ పట్టాల్సిన అవసరం లేకుండానే ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. భారత్‌, అఫ్గనిస్తాన్‌ వన్డే సిరీస్‌ 12న ధర్మశాల వన్డేతో ఆరంభం కానుంది.

​అఫ్గాన్‌ను తిప్పేశారు
భారత స్పిన్నర్లు అఫ్గనిస్తాన్‌ను తిప్పేశారు. అఫ్గాన్‌తో 2018లో బెంగళూరు టెస్టు రెండు రోజుల్లోనే ముగియగా.. న్యూ చంఢీగడ్‌లో మూడు రోజుల్లో ముగుస్తుందని ఎవరూ అనుకోలేదు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసినా.. అఫ్గనిస్తాన్‌ సైతం రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రెండు రోజులైనా బ్యాటింగ్‌ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. రెహమత్‌ షా (60) అర్థ సెంచరీతో మెరవటంతో ఆ జట్టు ఫాలోఆన్‌ తప్పించుకునే అవకాశాలు సైతం ఉన్నాయి. కానీ రెహమత్‌ షాను వాషింగ్టన్‌ సుందర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయటంతో అఫ్గాన్‌ కథ ముగిసింది. అజ్మతుల్లా (0), అఫ్సార్‌ (3), అష్రాఫ్‌ (11), సలీమ్‌ (0), జియార్‌ (6) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో మూడో రోజు తొలి సెషన్లోనే అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ కథ ముగిసింది. అఫ్గనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 412 పరుగుల భారీ వెనుకంజలో నిలిచింది. దీంతో భారత్‌ అప్గనిస్తాన్‌ను ఫాలోఆన్‌ ఆడించింది. ​ఫాలోఆన్‌లో అఫ్గనిస్తాన్‌ మరింత వేగంగా కుప్పకూలింది. ఓపెనర్‌ అటల్‌ (42, 80 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రెహ్మనుల్లా గుర్బాజ్‌ (24, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఆ జట్టులో ఇతర బ్యాటర్లు తేలిపోయారు. కీలక ఆటగాడు రెహమత్‌ షా (13) మరోసారి వాషింగ్టన్‌ సుందర్‌ మాయలో పడ్డాడు. వాషింగ్టన్‌ నాలుగు వికెట్లు, కుల్‌దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లతో మ్యాజిక్‌ చేశారు. హష్మతుల్లా (5), అఫ్సార్‌ (8), అజ్మతుల్లా (4), ఖరోటె (6), సలీమ్‌ (0), షరాఫుద్దీన్‌ (0) క్రీజులో నిలబడలేకపోయారు. 35.5 ఓవర్లలో 112 పరుగులకే అఫ్గనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది.

​సంక్షిప్త స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌
: 564/8 డిక్లేర్డ్‌ (శుభ్‌మన్‌ గిల్‌ 126, రాహుల్‌ 100, పంత్‌ 81, సాయి సుదర్శన్‌ 81, సుందర్‌ 52, సలీమ్‌ 6/140)
అఫ్గనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ : 152/10 (రెహమత్‌ షా 60, షాహిది 20, మానవ్‌ సుతార్‌ 6/33, ప్రసిద్‌ కృష్ణ 3/37)
అఫ్గనిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌) : 112/10 (సెదిఖుల్లా అటల్‌ 42, రెహ్మనుల్లా గుర్బాజ్‌ 24, వాషింగ్టన్‌ సుందర్‌ 4/36, కుల్‌దీప్‌ యాదవ్‌ 3/30)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -