Tuesday, June 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసిరులు కురిపించని గిరి వికాసం

సిరులు కురిపించని గిరి వికాసం

- Advertisement -

పత్తాలేని పైలట్‌ ప్రాజెక్ట్‌
ఏడాది కింద సీఎం ప్రారంభించిన జలసిరి 
వికాస పథకం
విస్తరణకు నోచుకోని వైనం


నవతెలంగాణ- 
మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

పేద గిరిజన రైతుల ఆర్థిక స్వాలంబన, చేయూత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ”ఇందిర సౌరగిరి జలవికాసం” విస్తరణకు నోచుకోలేదు. ఏడాది కిందట సీఎం చేతుల మీదుగా ప్రారంభమైనా.. ఆ తర్వాత ముందుకు సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించిన సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఏడాది కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ”ఇందిర సౌర గిరి జలవికాసం” పేరిట 100 శాతం సబ్సిడీతో, రూ.6 లక్షల విలువైన సోలార్‌ పంపుసెట్లు, ప్యానెళ్లను రైతులకు ఉచితంగా అందించడం ద్వారా గిరిజనులు ఆర్థికంగా నిలబడతారని చెప్పారు. రైతులకు అదనపు ఆదాయం సైతం వస్తుందన్నారు. సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా రైతులకు ప్రతినెలా అదనంగా రూ 3,000 నుంచి రూ 5,000 వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. పోడు భూములను సాగుచేసుకునే గిరిజనులకు ఎటువంటి కరెంట్‌ కోతలు, విద్యుత్‌ బిల్లుల భారం లేకుండా ఉచితంగా, నాణ్యమైన సాగునీరు అందుతుందని మాటిచ్చారు. కానీ, అవేమీ అమలుకు నోచుకోవడం లేదని ‘నవ తెలంగాణ’ పరిశీలనలో వెలుగులోకి వచ్చాయి.

ఉద్యోగాలేవీ..?
పోడు భూముల్లో మొక్కలు నాటి వాటి కాపలా కోసం మోటార్ల నిర్వహణ కోసం ముగ్గురు యువతీయువకులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇరిగేషన్‌ శాఖలో శిక్షణ కూడా ఇప్పించారు. మొక్కలు నాటి సంవత్సరం దాటినా ఇప్పటివరకు ఉద్యోగాల ఊసే లేదు. చెంచుల భూముల చుట్టూ తోటల కాపలా కోసం కంచె ఏర్పాటు చేస్తామన్నారు. చెంచులు నాలుగు ఐదు ఎకరాలు చదును చేసుకుంటే కేవలం ఎకరన్నరకు మాత్రమే పట్టాలిచ్చారని, మిగతా భూమిలో ఇతరులకు అవకాశం కల్పిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మామిడి, బత్తాయి, సపోటా తోటల నిర్వహణ తెలియక చెంచులు ఇబ్బందులు పడుతున్నారు.

విస్తరించని జల వికాసం
మాచవరం గ్రామంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించినా ఇంకా ఇతర గ్రామాలకు అందలేదు. అంచెలంచెలుగా నియోజకవర్గం మొత్తం విస్తరిస్తామన్నారు. దీని ద్వారా గిరిజనులు గిరిజనేతరులు సైతం లబ్ది పొందుతారని ప్రజాప్రతినిధులు ప్రకటించారు. నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల్లో 15000 ఎకరాలకు పైగా ఈ ప్రాజెక్టును వర్తింపజేయాలని చెప్పారు. ఇప్పుడు మాచారం తప్ప ఈ ప్రాజెక్టు ఎక్కడా వికసించడం లేదు.

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఇలా ..
అచ్చంపేట నియోజకవర్గంలో 58 గ్రామాల్లో 1827 మంది రైతులకు 4612.4 ఎకరాల పోడు భూములు ఉన్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో 24 గ్రామాలు 1083మంది రైతులకు 2531.1 ఎకరాల పోడు భూములు ఉన్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో 8 మంది రైతులకు 24.5 వికలాల పోడు భూములు ఉన్నాయి. మొత్తం 85 గ్రామాల్లో 2918 మంది రైతుల ఆధీనంలో 7168 ఎకరాలుండగా.. ఇందిర సౌర జలవికాసం ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వం ఆలోచన. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 12,600 కోట్లు కేటాయించారు.

సారు మాట మరిచారు : పార్వతమ్మ, చెంచు మహిళ- మాచారం- అమ్రాబాద్‌ మండలం
ఏడాది కిందట ముఖ్యమంత్రి మా దగ్గరికి వచ్చి మానెత్తి మీద చేయి పెట్టి ఉపాధి కల్పిస్తామన్నారు. మా పిల్లలకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇవ్వలేదు.

మోటార్లు పాడవుతున్నా పట్టించుకోవడం లేదు : మల్లయ్య, చెంచు యువకుడు- మాచారం
ఇందిర గిరిజల వికాసం పేరుతో మాకు నీటి వసతి కల్పించారు. బోరు బావుల్లో ప్లాస్టిక్‌ పైపులకు మోటార్లను బిగించడం వల్ల మోటర్లు ఊడి బోరు బావుల్లో పడుతున్నాయి. ఎవరికి చెప్పుకున్నా రిపేరు చేయడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి.

ప్రభుత్వానికి లెటర్‌ రాశాం : 
జాఫర్‌, ఐటీడీఏ జిల్లా అధికారి
గిరి జల వికాసంలో భాగంగా మాచార గ్రామంలో చెంచులకు పండ్ల తోటల పెంపకానికి అవకాశం కల్పించాం. అయితే నిధులు లేక నిర్వాహణ భారంగా మారింది. ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశాం. నిధులు రాగానే స్టార్టర్లు, మోటార్లను బాగు చేసి సాగునీటి సమస్య లేకుండా చూస్తాం.

సమస్యల్లో 
సౌర గిరి జలవికాసంఏడాది కిందట ఇందిర సౌరగిరి జలవికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉచితంగా బోరు బావులు తవ్వించి, విద్యుత్‌ కనెక్షన్లు, మోటారు
పంపుసెట్లను వంద శాతం సబ్సిడీతో సమకూర్చడంతోపాటు పేద గిరిజన రైతుల వ్యవసాయ భూములను సాగు యోగ్యంగా మార్పడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. ఏ ఒక్కటీ అమలు కాకపోగా బోరు బావులు మోటర్లు సైతం పనిచేయడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాచారం గ్రామంలో 56 చెంచు కుటుంబాలున్నాయి. వీరి కోసం 31 బోరుబావులు తవ్వారు. వాటిలో 17 బోరుబావులకు సౌర విద్యుత్తు పలకలను అమర్చారు. ఇక్కడ 10 మోటార్లు పైపును వీడి బోరు లోపల పడిపోయాయి. వీటిని బయటకు తీసే సాంకేతిక పరిజ్ఞానం చెంచులకు అందుబాటులో లేదు. దీంతో చెంచుల పోడు భూములకు సాగు నీరు అందడం లేదు. కొన్ని బోరు మోటార్లు పని చేసినప్పటికీ కాంట్రాక్టర్లు తమకు బిల్లులు రాలేదని స్టార్టర్ల దగ్గర తాళాలు వేసుకుని వెళ్లిపోయినట్టు లబ్దిదారులు అంటున్నారు. ”మీరు బిల్లులు ఇవ్వండి.. లేదా ప్రభుత్వం చేత ఇప్పించండి..” అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌ శాఖలవారు ఒకరిపై ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. ప్లాస్టిక్‌ పైపులు కాకుండా ఐరన్‌ పైపులు బిగిస్తే మోటార్లకు రక్షణగా ఉంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -