ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండేండ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తూ పార్టీకి పట్టం కట్టబోతున్నట్టు వివరించారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో ఖర్గే నివాసంలో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీలో సీఎం రేవంత రెడ్డి వెంట ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ ఉన్నారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ భారీ మెజార్టీ సాధించనుందని ఖర్గేకు సీఎం వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అందువల్ల పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే, మున్సిపల్ లోనూ పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. అనంతరం పార్టీ అధ్యక్షులు ఖర్గేతో సీఎం కాసేపు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల తీరు, సాధించే సీట్లపై మరింత లోతుగా చర్చించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు, ఆ తర్వాత పరిణామాలను ఖర్గేకు వివరించినట్టు తెలిసింది. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్టు సమాచారం. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ, శాఖల మార్పుపై కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పనితీరును ఖర్గే అభినందించారు. ఎన్నికల కోసం కాకుండా, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా పాలన చేస్తున్నారని సీఎం, మంత్రులను మెచ్చుకున్నారు. ముఖ్యంగా కుల వివక్షను రూపుమాపేలా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆలోచనను ఖర్గే అభినందించినట్టు తెలిసింది.
నేడు రాహుల్, కేంద్ర మంత్రులతో సీఎం భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టనున్నట్టు తెలిసింది. ప్రధానంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిన విషయం తెలిసిందే. ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటు రాష్ట్రంలో విద్యా సంస్థల అభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని సీఎం తో పాటు, మంత్రులు కేంద్రాన్ని కోరారు. అలాగే విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని కోరారు. కానీ, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు కేటాయింపులు కాకుండా శాఖల వారిగా కేటాయింపులు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న పథకాలకు ఆర్థిక సాయంతో పాటు, విద్యా సంస్థల డెవలప్‌మెంట్ కు ఎఫ్‌ఆర్ బీఎం పరిధి మినహాయింపు, విభజన హామీలపై సీఎం మరోసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేయనున్నట్టు తెలిసింది. అలాగే ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారం కోసం సీఎం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది.
తాజాగా ఏపీం సీఎం చంద్రబాబు పోలవరం-నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అనుమతులకై కేంద్రంపై ఒత్తిడి పెంచిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ అనుమతుల విషయంలో తెలంగాణ అభ్యంతరాలను ఆ శాఖమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ , ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జెపి నడ్డా, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆహార పంపిణీ శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి ల అపాయింట్‌మెంట్ లను కోరినట్టు తెలిసింది. అలాగే లోక్‌సభలో బీజేపీ సర్కార్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గొంతు నొక్కుతోన్న నేపథ్యంలో రాహుల్ గాంధీని కలిసి మద్దతు తెలపనున్నట్టు సమాచారం.



