కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
దూపటి వెంకటేష్.. సీపీఐ(ఎం) ఆలేరు మండల కార్యదర్శి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించి ప్రజలు, రైతులపై పడుతున్న భారాన్ని తగ్గించాలని సీపీఐ(ఎం) ఆలేరు మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరు మండల పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,గ్యాస్,ఎరువుల ధరలను అడ్డగోలుగా పెంచి ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం మోపుతోందన్నారు.పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల సామాన్య ప్రజల జీవనం మరింత భారంగా మారిందన్నారు.
వంట గ్యాస్ ధరల పెంపు గృహిణులు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.మరోవైపు ఎరువుల ధరలను పెంచడం ద్వారా రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఒకవైపు ప్రజలపై ధరల భారం మోపుతూ, మరోవైపు రైతులకు అవసరమైన ఎరువుల ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు, గ్రామసభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. జూన్ 2న పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.
గత మూడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడంతో వేలాది మంది అర్హులైన పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు సూదగాని సత్యరాజయ్య, పిక్క గణేష్, శంకర్ రావణ్, మండల కమిటీ సభ్యులు సంగీ రాజు, మిట్ట శంకరయ్య, అందె అంజయ్య, చౌడబోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.



