రూ.2,169 కోట్లతో నిర్మాణం
అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రెటేరియట్,
రెసిడెన్షియల్ కాంప్లెక్స్
రూ.2,534 కోట్ల అంచనా వ్యయం
కేంద్ర మంత్రివర్గం ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గుజరాత్‌లోని అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2ఎ (కోటేశ్వర్ రోడ్ నుంచి ఎయిర్‌పోర్టు కారిడార్)కు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇది ఐదు స్టేషన్లతో (4 ఎలివేటెడ్, 1 అండర్ గ్రౌండ్), 6.032 కిలో మీటర్ల పొడవైన కారిడార్ అని పేర్కొంది. బుధవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఫేజ్-2(ఎ) అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య 77.63 కిలోమీటర్ల మేర క్రియాశీల మెట్రో రైలు వ్యవస్థ ఉంటుంది. ఫేజ్-2(ఎ) కారిడార్‌లోని స్టేషన్ల పేర్లు… ఆశ్రమ్ రోడ్, కోటేశ్వర్ ప్రాచీన్ మందిర్, సబర్మతి నది, సర్దార్ నగర్, ఎయిర్‌పోర్టు అని పేర్కొంది. ఈ ప్రాజెక్టు పూర్తవటానికి అయ్యే మొత్తం వ్యయం రూ.2,169.04 కోట్లుగా పేర్కొంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి, జీపీఆర్‌ఏ నిర్మాణం రాష్ట్ర నూతన రాజధాని నగరం అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ (జీపీఆర్ఏ) నిర్మాణాలకూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులను రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.
రూ.1,299.08 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి నిర్మాణం, రూ. 1,234.91 కోట్ల అంచనా వ్యయంతో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్‌ఏ) నిర్మాణం చేపట్టనున్నారు. ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న నూతన గ్రీన్‌ఫీల్డ్ నగరం అమరావతిలో ఈ ప్రాజెక్టులు కీలకంగా నిలుస్తాయని పేర్కొంది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట అందుబాటులో ఉంచడంతో వాటికి పెరుగుతున్న కార్యాలయ వసతి డిమాండ్‌ను తీర్చడమే ఈ ప్రతిపాదన లక్ష్యమని తెలిపింది. ప్రధాని మోడీని అభినందిస్తూ తీర్మానం ఆమోదందేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు పదవిలో కొనసాగుతూ చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రిని అభినందిస్తూ మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. మోడీపై ప్రశంసలు కురిపిస్తూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి 4,399 రోజుల సుదీర్ఘ పాలన అభినందనీయమని కొనియాడారు.



