Thursday, June 11, 2026
E-PAPER
Homeజాతీయం13లోగా కేంద్ర విద్యా శాఖ మంత్రి 
రాజీనామా చేయాలి

13లోగా కేంద్ర విద్యా శాఖ మంత్రి 
రాజీనామా చేయాలి

- Advertisement -

​లేకుంటే దేశ‌వ్యాప్త ఆందోళ‌నలు
కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) పిలుపు
నేడు పూణేలో ఆందోళ‌న‌
ఆ త‌ర్వాత ల‌క్నో, అమృత్‌స‌ర్‌, బెంగ‌ళూరు, జైపూర్‌, హైద‌రాబాద్ లో..
20న జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక ధ‌ర్నా

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
​దేశంలోని ల‌క్ష‌లాది మంది విద్యార్థుల భ‌విష్య‌త్తును అగ‌మ్య‌గోచ‌రంగా మార్చిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఈనెల 13లోగా రాజీనామా చేయాల‌నీ, లేనిప‌క్షంలో దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ఈ మేర‌కు బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కూ నిర‌స‌న‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేందుకు దేశ యువ‌త భ‌య‌ప‌డ‌టం లేద‌ని తెలిపింది. నేడు పూణేలో ఆందోళ‌న చేప‌ట్ట‌నుంది. ఆ త‌రువాత ల‌క్నో, అమృత్‌స‌ర్‌, బెంగ‌ళూరు, జైపూర్‌, హైద‌రాబాద్‌ల్లో కూడా ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అదే విధంగా ఈనెల 20న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక ధ‌ర్నా చేప‌డ‌తామ‌ని హెచ్చరించింది. ‘‘పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకల కారణంగా లక్షలాది కుటుంబాలు, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇది ఒక జాతీయ సమస్య.

పదేపదే జరుగుతున్న ఈ వైఫల్యాలకు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించడంలో విఫలం అయ్యారు. జవాబుదారీతనం ఉన్నత స్థాయి నుంచే ప్రారంభం కావాలి. అందుకే మేము ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని పున‌రుద్ఘాటిస్తున్నాం’’ అని సీజేపీ పేర్కొంది.దేశ విద్యా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి, సంస్థాగత వైఫల్యానికి ఏ విద్యార్థి కూడా మూల్యం చెల్లించకుండా చూసేందుకు ఈ ఉద్యమం చేపట్టినట్టు తెలిపింది. జవాబుదారీతనం, న్యాయం కోసం జరిగే పోరాటంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాలు పంచుకోవాలని సీజేపీ పిలుపునిచ్చింది. పూణేలో జ‌రిగే నిర‌స‌న‌లో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొంటార‌ని తెలిపింది.

ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి : అభిజీత్‌ ‌దీప్కే
విద్యార్థుల‌ను ప్ర‌భావితం చేసే స‌మ‌స్య‌ల‌పై దేశ యువ‌త ఇక‌పై మౌనంగా ఉండేందుకు సిద్ధంగా లేద‌ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయ‌క‌పోతే దేశ‌వ్యాప్త నిర‌స‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. . ప్ర‌భుత్వం నైతిక బాధ్య‌త తీసుకోవాల‌ని సూచించారు. నీట్‌, సీబీఎస్ఈ, సీయూఈటీ వంటి ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల కార‌ణంగా కోటి మందికి పైగా విద్యార్థులు న‌ష్ట‌పోయార‌ని, ఈ ప‌రిస్థితికి బాధ్య‌త తీసుకోవడానికి ఎవ‌రూ సిద్ధంగా లేర‌ని అన్నారు. వ్య‌వ‌స్థ వైఫ‌ల్యం కార‌ణంగా, డాక్ట‌ర్లుగా ఎదిగి ప్రాణాల‌ను కాపాడ‌గ‌లిగే విద్యార్థులు త‌మ ప్రాణాల‌ను కోల్పోతున్నార‌ని విమ‌ర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -