మూడ్రోజుల్లో మూడు నౌకలపై
క్షిపణులతో విధ్వంసం
అమెరికా దౌత్యవేత్తకు సమన్లు
వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన దాడిని
తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
మస్కట్ : ఒమన్ సమీపంలో భారత నౌక ‘జల్ వీర్’ పై దాడి జరిగింది. ఈ దాడిలో గల్లంతైన ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఒమన్ సముద్ర మార్గంలో వెళ్తున్న భారత నౌకలపై మూడు రోజుల్లో మూడు దాడులు జరగడం గమనార్హం. ఓ వైపు భారత నౌకలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఇరాన్ అంటుంటే.. మరోపక్క భారత్ హార్ముజ్ మార్గంలో కాకుండా ఒమన్ సముద్ర తీరం నుంచి రాకపోకలు సాగిస్తోంది. అయితే భారత్ ను ఇరకాటంలో పెట్టడమే కాదు. ఇరాన్ పై బురదజల్లేలా అమెరికా దుష్ట పన్నాగం చేస్తుందన్న వాస్తవాన్ని ఎట్టకేలకు భారత్ గుర్తించింది.
అసలేం జరిగింది..?
ఒమన్ తీరంలో వాణిజ్య నౌక ‘జల్ వీర్’పై దాడి జరిగిన సమయంలో ఓడలో మొత్తం 28 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 24 మంది భారతీయులు ఉన్నారు. ఈ దాడి తర్వాత ముగ్గురు భారతీయులు గల్లంతైనట్టు సమాచారం. కాగా మరో 21 మంది సురక్షితంగా ఉన్నట్టు ప్రకటించింది. అయితే గల్లంతైన ఆ ముగ్గురూ అమెరికా జరిపిన వైమానిక దాడిలో చనిపోయినట్టు నిర్థారణ అయ్యింది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగానే ఇది జరిగి ఉండవచ్చని బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఎంబ్రాయర్ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. దాడి జరిగితే ఓడ వెనుక భాగంలో కాకుండా, ముందు భాగంలో గుమిగూడాలని సిబ్బందిని గతంలోనే హెచ్చరించినట్టు తెలిపింది.
మూడు రోజుల్లో మూడు నౌకలపై దాడులు
ఎం.టి. జల్ వీర్ నౌకపై దాడికి ముందు, గత రెండు రోజులుగా ఒమన్ తీరప్రాంతంపై దాడులు జరుగుతున్నాయని వెల్లడైంది. ఒక నౌకపై వరుసగా ఇది మూడవ దాడి. కాగా బుధవారం, సెటెబెలో ట్యాంకర్‌పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ దాడి గురించి నివేదించింది. ఈ విషయంపై మరింత సమాచారం సేకరిస్తున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలో భారత్, అమెరికా చార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించి అధికారికంగా నిరసన తెలిపింది. ‘‘ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలనీ ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలకు త్వరగా ముగింపు పలకాలని కోరుతున్నాం. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే చర్యలకూ ముగింపు పలకాలి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్యం వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి” అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గురువారం కూడా షినాస్ పోర్టు సమీపంలో ఓ నౌకకు సంబంధించిన ఘటన గురించి తమకు సమాచారం అందిందని అధికారులు జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. విషయం యొక్క తీవ్రత దృష్ట్యా, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు స్థానిక పరిపాలన, సంబంధిత అధికారులతో సమన్వయం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు గల కారణం లేదా దాని వల్ల కలిగే ప్రభావం గురించి ఎలాంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు.



