విద్యా వ్యవస్థలో లోపాలపై
దేశవ్యాప్తంగా ఆందోళనలు
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా.. పట్టించుకోని కేంద్రం : ఏఐసీసీ సమావేశ నిర్ణయాలను వెల్లడించిన కెసి వేణుగోపాల్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ సమస్యలు, విద్యావ్యవస్థలో లోపాలపై రానున్న రెండు, మూడు నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రచారాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు ప్రధాని మోడీ వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు. మోడీ సర్కారు పాలనలో ప్రజలు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ఆరోపించారు. గురువారం నాడిక్కడ ఇందిరా భవన్‌లో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత ఏఐసీసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెసి వేణుగోపాల్ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్త ఆందోళనలు, ప్రచారాలకు సంబంధించి మూడు, నాలుగు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. జాతీయస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లో పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని విమర్శిం చారు. కోర్టు నోటీసు ఆధారంగా చేసుకుని ఎఫ్ఐఆర్ లేకపోయినా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు సరిగ్గా నింపకపోయినా ఆ నామినేషన్ అంగీకరించారని గుర్తు చేశారు.
దయనీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం
దేశంలో ప్రజాస్వామ్యం దయనీయ పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కార్యాలయం లోపలికి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామని అన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎంపీలను బీజేపీ ఎంపీలుగా మార్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ఇప్పుడు సీటు చోరీకి పాల్పడుతోందని ఆక్షేపించారు. దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్థిక సంక్షోభం అంశాలపై మాట్లాడామని కెసి వేణుగోపాల్ తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా కేంద్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోతుందని చెప్పుకొచ్చారు. దేశ యువత భవిష్యత్తు ఆందోళనలో ఉందని తెలిపారు. పేపర్ లీకుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ప్రభావితం అయ్యారని చెప్పారు.
నీట్ పరీక్ష లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం నైతిక బాధ్యత కూడా వహించడం లేదని ఆగ్రహించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేపర్ లీక్ అంశాలు దేశంలో ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యలని ప్రస్తావించారు. రానున్న రెండు, మూడు నెలల్లో విద్యావ్యవస్థలో లోపాలపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కెసి వేణుగోపాల్ వివరించారు. ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల మన రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త ఆందోళనల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కూర్చుని మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించాలని ఆదేశాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్ చోరీ నుంచి సీట్ చోరీకి బీజేపీ
- Advertisement -
- Advertisement -



