Friday, June 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందద్దరిల్లుతున్న పశ్చిమాసియా

దద్దరిల్లుతున్న పశ్చిమాసియా

- Advertisement -

ఇరాన్‌ సైనిక, గూఢచర్య,
రాడార్‌ స్థావరాలపై అమెరికా దాడులు
జోర్డాన్‌, బహ్రెయిన్‌, కువైట్‌లోని అమెరికా ఆస్తులపై
ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం
విద్యుత్‌ ప్లాంట్లు, బ్రిడ్జిలను ధ్వంసం చేస్తాం : ట్రంప్‌
చూస్తూ ఊరుకోం…ఎదుర్కొంటాం : పెజెష్కియాన్‌

రెండో రోజూ ఆగని పోరు ఇరాన్‌ సైనిక, గూఢచర్య, రాడార్‌ స్థావరాలపై అమెరికా దాడులు


నవతెలంగాణ – జనరల్‌ డెస్క్‌
మధ్యప్రాచ్యంలో వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌, అమెరికా సేనలు పరస్పరం దాడులు జరిపాయి. దీంతో ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు అలముకున్నాయి. ఇరాన్‌పై విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రకటించిన కొద్ది గంటలకే దక్షిణ ఇరాన్‌లోని సైనిక, గూఢచర్య, రాడార్‌ స్థావరాలపై ‘ఆత్మరక్షణ’ దాడులు జరిగాయి. వీటికి ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్‌, జోర్డాన్‌ దేశాలలోని అమెరికా సైనిక ఆస్తులపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అమెరికా సేనలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దానిని ఆచరణలో అర్థరహితం చేస్తున్నాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ గురువారం ఆరోపించింది. ఈ నేరపూరిత చర్యకు అమెరికా నేతలే బాధ్యత వహించాలని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అమెరికా ఆస్తులే లక్ష్యంగా…
జోర్డాన్‌లోని అమెరికా కమాండ్‌ కేంద్రంపై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేశామని ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) తెలిపింది. మువాఫక్‌ సల్తీ వైమానిక స్థావరంపై 12 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించామని, ఆ తర్వాత పెద్ద సంఖ్యలో అమెరికా ఫైటర్‌ జెట్లను, స్థావరాలను ధ్వంసం చేశామని వివరించింది. ఇరాన్‌ వైపు నుంచి దూసుకొచ్చిన 20 క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు, వైమానిక దళం అడ్డుకున్నాయని జోర్డాన్‌ ప్రభుత్వ మీడియా చెప్పింది. సెంట్రల్‌ జోర్డాన్‌లోని అజ్రఖ్‌ పట్టణం వైపు ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించిందని, అయితే ప్రాణనష్ ఆస్తినష్టం కానీ జరగలేదని తెలియజేసింది. బహ్రెయిన్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం…ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఎయిర్‌ రెయిడ్‌ సైరన్లు మోగించారు. ఇరాన్‌ ప్రయోగించిన డ్రోన్లను మధ్యలోనే అడ్డుకోవడంతో వాటి శకలాలు రాజధాని మనామా నగరం, హమద్‌ పట్టణంపై పడి జనావాసాలకు నష్టం జరిగింది. అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. పదకొండు సంవత్సరాల బాలిక స్వల్పంగా గాయపడింది. కాగా ఇరాన్‌ వైపు నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డు కున్నాయని కువైట్‌ సైన్యం తెలిపింది. ఇరాన్‌ దాడుల నేప థ్యంలో కువైట్‌ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసిఆ తర్వాత తెరిచింది.ఒప్పందంపై సంతకం చేయకుంటే

దాడులు ఉధృతం : ట్రంప్‌ హెచ్చరిక
అమెరికా తాజా దాడులు ప్రారంభమైన తర్వాత ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ ‘మేము నిన్న వారిని తీవ్రంగా నష్టపరిచాం. ఈ రోజు కూడా అదే జరగబోతోంది’ అని తెలిపారు. ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇరాన్‌ నేతలు చాలా సమయం తీసుకుంటున్నారని ఆరోపిస్తూ అందుకు వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఒప్పందం కుదరని పక్షంలో మరిన్ని దాడులు తప్పవని బెదిరించారు. ఒప్పంద పత్రంపై సంతకం చేయడం మినహా ఇరాన్‌కు మరో దారి లేదని చెప్పారు. దాడులు ఆపాల్సిందిగా ఇరాన్‌ ఉన్నతాధికారులు తనను కోరారని చెప్పుకొచ్చారు. కాగా ఇరాన్‌ విద్యుత్‌ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడి చేయాలని అను కుంటున్నానని ఫాక్స్‌్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ తెలిపారు. దౌత్య యత్నాలు నిలిచిపోతే సైనిక చర్యలు తీవ్రమవుతాయని చెప్పారు. ‘ఇరాన్‌వి మాటలే. చేతలు లేవు. మధ్యప్రాచ్యం రౌడీ చనిపోయింది’ అని వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌కు ఓ అవకాశం ఇచ్చా మని, కానీ ఆ దేశం దానిని ఉపయోగించుకోలేదని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ విమర్శించారు. ఇరాన్‌లోని కీలక స్థావరాలపై బాంబు దాడులు జరుగుతాయని చెప్పారు.

పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్‌
అమెరికా దాడుల కారణంగా రాజధాని టెహ్రాన్‌, ఓడరేవు పట్టణమైన బందర్‌ అబ్బాస్‌ పరిసర ప్రాంతాలలోనూ, హార్ముజ్‌ జలసంధి సమీపంలోని ఇతర దక్షిణ ప్రాంతాలలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తెలియజేసింది. టెహ్రాన్‌ సమీపంలోని అబ్యెక్‌, ఖర్‌ఛాక్‌, మినాబ్‌, నజారాబాద్‌, కరజ్‌లో పేలుడు శబ్దాలు వినిపించాయి. అలాగే హార్ముజ్‌ సమీపంలో దక్షిణ దిశగా ఉన్న సిరిక్‌, బందర్‌ అబ్బాస్‌, ఖెష్మ్‌లో కూడా పేలుళ్లు జరిగాయి. ఫార్స్‌ రాష్ట్రంలోని షిరాజ్‌ నగరంలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. హార్ముజ్‌ను పూర్తిగా మూసివేయడం జరిగిందని, ఏ ఒక్క నౌకను అనుమతించడం లేదని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా పేర్కొంది. హార్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేశామని ఐఆర్‌జీసీ చెప్పింది.
అయితే ఇరాన్‌ మీడియా వార్తలను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తోసిపుచ్చుతూ హార్ముజ్‌ మీదుగా వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపింది. హార్ముజ్‌ మూసివేత, నౌకలపై దాడుల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర రెండు శాతం పెరిగి బ్యారల్‌ ధర 95 డాలర్లకు చేరింది.

దౌత్య పరిష్కారానికి ప్రయత్నించండి : ఐరాస హితవు
దాడులు, ప్రతి దాడులతో మధ్యప్రాచ్యాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నారని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాజా దాడులతో కాల్పుల విరమణ ‘తక్కువ తీవ్రత కలిగిన మంట’గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నపాటి మంటలు పెద్ద అగ్ని ప్రమాదంగా మారవచ్చునని, ఆ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదని అంటూ దౌత్య పరిష్కారం కోసం అన్ని పక్షాలు ప్రయత్నించాలని సూచించారు. ‘దాడులు వద్దు….సాకులు వద్దు’ అని అన్నారు.

దేనికైనా సిద్ధమే : ఇరాన్‌
అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని, ఎలాంటి ఒత్తిడినైనా, ప్రమాదాన్ని అయినా ఎదుర్కొనేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ సందేశాలతో దౌత్య ప్రక్రియకు అమెరికా నష్టం కలిగిస్తోందని ఇరాన్‌ విదేశాంగ శాఖ ఆరోపించింది. అమెరికా జరుపుతున్న చట్టవిరుద్ధమైన, నేరపూరిత దాడులను తీవ్రంగా ఖండించింది. ‘గత కొన్ని గంటలలో అమెరికా సేనలు జరిపిన దాడులు కాల్పుల విరమణను నిరుపయోగం చేశాయి. ఐక్యరాజ్యసమితి ఛార్టర్‌ను, వివిధ దేశాల జాతీయ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించి అంతర్జాతీయ చట్టాల ప్రాథమిక సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘించాయి’ అని మండిపడింది. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాల అరాచకాలు, దౌర్జన్యాలపై మౌనం వహించడం, చర్యలు చేపట్టకపోవడం ప్రపంచాన్ని మరింత గందరగోళం, అభద్రత వైపు నెడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఛార్టర్‌ ఉల్లంఘనను వ్యతిరేకించాలని ఐరాస సభ్య దేశాలను కోరింది. కాగా హార్ముజ్‌ జలసంధిలో భద్రత కొరవడితే మధ్యప్రాచ్యాన్ని ‘నరకం’గా మారుస్తామని ఇరాన్‌ సీనియర్‌ సైనికాధికారి ఒకరు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -