భారత వృద్ధి 6.6 శాతమే..!
ఎరువుల కొరత పెరగొచ్చు :
ప్రపంచ బ్యాంక్ అంచనా
వాషింగ్టన్ : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరగడం, మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడం వల్ల ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కేవలం 2.5 శాతానికే పరిమితం కానుందని ప్రపంచ బ్యాంక్ గురువారం హెచ్చరించింది. ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ వాణిజ్యాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత బలహీనమైన ఆర్థిక వృద్ధి కావడం గమనార్హం. ఈ సంక్షోభం కారణంగా ప్రపంచంలోని మూడింట రెండు వంతుల దేశాల వృద్ధి రేటు అంచనాలను బ్యాంక్ సవరించింది. అమెరికా అతిపెద్ద ఇంధన ఉత్పత్తి దారు, ఏఐ రంగంలో పెట్టుబడుల వల్ల అమెరికా 2.2 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా వేసింది.యుద్ధ ప్రభావంతో అభివృద్ధి చెందుతున్న వర్థమాన మార్కెట్ దేశాల 2026 వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంక్ 0.4 శాతం తగ్గించి 3.6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 4.2 శాతంగా అంచనా వేయగా.. 21 యూరోపియన్ దేశాల వృద్ధి కేవలం 0.8 శాతానికి పడిపోనున్నాయి. భారతదేశం ప్రస్తుత ఏడాది 6.6 శాతం ఆర్థిక వృద్ధి రేటుకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. గతేడాది సాధించిన 7.7 శాతం వృద్ధితో పోలిస్తే ఈసారి కొంత మందగిస్తుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
మండిపోతున్న చమురు ధరలు..
అమెరికా, ఇజ్రాయిల్ దుశ్చర్య దాడులకు ప్రతిచర్యగా ప్రపంచంలోని ఐదింట ఒక వంతు చమురు, సహజ వాయువు రవాణా అయ్యే కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఈ ఏడాది అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెండ్ క్రూడ్ చమురు ధర సగటున బారెల్‌కు 94 డాలర్లకు చేరుకోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇది 2025 ధర కంటే 36 శాతం, జనవరిలో ఊహించిన దానికంటే 50 శాతం ఎక్కువ. ఇంధన సంక్షోభంతో పాటు పర్షియన్ గల్ఫ్ ద్వారా జరిగే ఎరువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలగడం వల్ల ఎరువుల సరఫరా తగ్గనుంది. తద్వారా అంతర్జాతీయంగా తీవ్ర ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది.



