74 దేశాల్లో నిషేధం..
భారత్‌లో చెలామణి
తొమ్మిది పంటలకు అనుమతి
ఏటా 100 మెట్రిక్ టన్నుల వినియోగం
కలుపుమందు శరీరంలోకి
వెళ్తే ప్రమాదం
ఎవరి ప్రయోజనాల కోసం
అనుమతులు?
ఆందోళన వ్యక్తంచేస్తున్న పర్యావరణవేత్తలు, ఆరోగ్య నిపుణులు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర వ్యవసాయ రసాయనాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పారాక్వాట్ డైక్లోరైడ్ భారత్‌లో ఇప్పటికీ చట్టబద్ధంగా వినియోగంలో ఉంది. మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా భావించి ప్రపంచవ్యాప్తంగా 74 దేశాలు నిషేధించిన ఈ కలుపు మందును భారత్లో కొనసాగించడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మందుకు ప్రపంచంలో ఎక్కడా నిర్దిష్ట విరుగుడు (అంటీడోట్) లేకపోవడం ఈ భయాల్ని మరింత పెంచుతోంది. ఒకప్పుడు వ్యవసాయ ఉత్పాదకత పెంపు నకు కీలక సాధనంగా భావించిన ఈ రసాయనం.. ప్రస్తుతం మానవ ఆరోగ్యం, పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిగణించబడుతోంది. పారాక్వాట్ చరిత్ర 1882లో ప్రారంభమైంది. ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు దీనిని తొలిసారిగా సృష్టించారు. మొదట్లో దీన్ని మిథైల్ వైయోలజెన్‌గా పిలిచేవారు. రంగుల తయారీలో ఉపయోగించేవారు. 1955లో బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీనిలో కలుపు మొక్కలను వేగంగా ఎండబెట్టి నాశనం చేసే లక్షణాన్ని గుర్తించారు. అనంతరం ఇది 1962లో ‘గ్రామా క్సోన్’ పేరుతో ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిం చింది.
అభివృద్ధి చేసిన దేశాలే నిషేధించాయి
ఈ మందును ఏ దేశాలైతే అభివృద్ధి చేశాయో ఆ దేశాలన్నీ దీని వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. ఆస్ట్రియా 1993లోనే నిషేధించగా, బ్రిటన్ 2007లో దీనిపై బ్యాన్ విధించింది. స్విట్జర్లాండ్ 1989లోనే వినియోగాన్ని ఆపేసింది. ఆ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి యూరోపియన్ దేశాలు కూడా నిషేధం అమలు చేశాయి. అలాగే బ్రెజిల్, థాయ్‌లాండ్, మలేషియాలు 2020లో, కెనడా 2023లో దీనిపై నిషేధం విధించాయి. వియత్నాం, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు, ఇతర కలుపు మందుల ద్వారా పంటల దిగుబడిపై ప్రభావం లేకుండా వ్యవసాయం కొనసాగిస్తున్నాయి.
భారత్‌లో…
భారత్‌లో పారాక్వాట్ వినియోగం హరిత విప్లవ కాలంలో ప్రారంభమైంది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, కూలీల వ్యయం తగ్గింపు లక్ష్యాలతో దీనిని ప్రోత్సహించారు. ప్రస్తుతం కేంద్ర క్రిమిసంహారక మందుల బోర్డు (సీఐబీఆర్‌సీ) కేవలం తొమ్మిది పంటలకే దీన్ని అనుమతించింది. వాటిలో టీ, బంగాళాదుంప, పత్తి, రబ్బరు, కాఫీ, వరి, గోధుమ, మొక్కజొన్న, ద్రాక్ష పంటలు ఉన్నాయి. అయితే 2013లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇతర దేశాల్లో నిషేధించబడి, భారత్‌లో మాత్రమే అనుమతిలో ఉన్న 66 క్రిమిసంహారక మందులపై సమీక్ష చేపట్టింది. వ్యవసాయ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ అనుపమ్ వర్మ నేతృత్వంలోని కమిటీ 2015లో నివేదిక సమర్పించింది. ఈ కమిటీ పారాక్వాట్‌పై పూర్తి నిషేధాన్ని సిఫారసు చేయకుండా భద్రతా ప్రమాణాలు, ప్రత్యేక ప్యాకేజింగ్, వైద్య సదుపాయాల వంటి షరతులతో వినియోగాన్ని కొనసాగించేందుకు అనుమతించింది.
పేలవంగా సిఫార్సుల అమలు
డాక్టర్ అనుపమ్ వర్మ కమిటీ చేసిన భద్రతా నిబంధనలు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు కావట్లేదు. ఏటా భారత్‌లో 100 మెట్రిక్ టన్నులకు పైగా పారాక్వాట్ వినియోగం జరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెసర పంట కోతకు ముందు త్వరగా ఎండబెట్టేందుకు పారాక్వాట్‌ను వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆహార శ్రేణిలో రసాయన అవశేషాలు చేరే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆందోళనకరం
పారాక్వాట్ విషపూరితకు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా నిర్దిష్ట విరుగుడు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పొరపాటున శరీరంలోకి వెళ్లినా, అధిక మోతాదులో తాకినా తీవ్రమైన అవయవ నష్టం, మరణం సంభవించే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత నియంత్రణ వ్యవస్థ, ప్రజారోగ్య భద్రత, క్రిమిసంహారక మందుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు అత్యంత ప్రమాదకరంగా భావించి నిషేధించిన రసాయనం భారత వ్యవసాయంలో ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోందన్న అంశంపై మరింత లోతైన సమీక్ష అవసరమని పర్యావరణవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.



