టైటిల్ రేసులో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన
నేటి నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్
బరిలో భారత్ సహా 12 జట్లు
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను అందుకున్న జోష్‌లో ఉన్న టీమ్ ఇండియా అమ్మాయిలు.. అదే జోరులో ఐసీసీ టీ20 టైటిల్‌పై కన్నేశారు. 2020లో టీ20 ప్రపంచకప్‌కు అడుగు దూరంలో నిలిచిన భారత అమ్మాయిలు 2026 టీ20 ప్రపంచకప్‌లో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. 12 జట్లు రేసులో ఉండగా నేటి నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆరంభం.
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
ఓ వైపు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు జయకేతనం. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భారత క్రికెటర్ల మెరుపు ప్రదర్శనలు. డబ్య్లూపీఎల్ సహా ఇతర గ్లోబల్ టీ20లు మహిళల క్రికెట్‌కు వన్నె తీసుకురాగా.. భారీ అంచనాల నడుమ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శ్రీలంక తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు రాత్రి 11 గంటలకు ఆరంభం కానుండగా.. టోర్నమెంట్‌లో భారత్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు జరుగుతాయి.
టైటిల్ రేసులో 12 జట్లు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో ఈసారి 12 జట్లు నిలిచాయి. ఆరేసి జట్లు గ్రూప్ దశలో రౌండ్ రాబిన్ పద్దతిలో పోటీపడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. జులై 5న లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గ్రూప్-ఏలో ఆరుసార్లు చాంపియన్ ఆస్ర్టేలియా, బంగ్లాదేశ్, భారత్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ఉండగా.. గ్రూప్-బిలో డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్, ఆతిథ్య ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి.
కంగారూలదే ఆధిపత్యం
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఫార్మాట్ ఏదైనా ఆధిపత్యం ఆస్ర్టేలియాదే. 2009లో తొలి టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ సాధించినా.. ఆ తర్వాత కంగారూలు తమదైన పంజా విసిరారు. 2010, 2012, 2014లో హ్యాట్రిక్ టైటిల్స్ కొట్టిన ఆసీస్ అమ్మాయిలు.. 2018, 2020, 2023లో మరోసారి తీన్‌మార్ మోగించారు. న్యూజిలాండ్ (2024), వెస్టిండీస్ (2014) సైతం ఓసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. ఆస్ర్టేలియా వేదికగా జరిగిన 2020 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్స్‌కు చేరింది. రికార్డు 90 వేల మంది అభిమానుల నడుమ జరిగిన మెల్‌బోర్న్ మెగా వార్‌లో ఆతిథ్య ఆసీస్ విజయం సాధించింది. దీంతో భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోర్నమెంట్‌లో 12 జట్లు పోటీపడుతుండగా.. 8 జట్లు తొలిసారి విజేతగా నిలిచేందుకు ఎదురుచూస్తున్నాయి.
ఇదే సరైన తరుణం
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన భారత జట్టు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టైటిల్ వేటలో మేటి జట్లను మట్టికరిపించిన హర్మన్‌ప్రీత్ సేన.. ఇంగ్లాండ్ గడ్డపై ఆ ప్రదర్శన పునరావృతం చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగ్స్, రిచా ఘోష్‌లు ఈ ఫార్మాట్‌లో ధనాధన్ జోరుతో పరుగుల వేట సాగించగల సత్తా ఉన్న బ్యాటర్లు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మలు కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నారు. క్రాంతి గౌడ, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, శ్రీ చరణి, రాధ యాదవ్‌తో కూడిన బౌలింగ్ లైనప్ గొప్పగా కనిపిస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను సైతం సాధిస్తే.. ఏకకాలంలో వన్డే, టీ20 చాంపియన్స్‌గా నిలిచిన ఆస్ర్టేలియా సరసన భారత్ నిలువనుంది. ఇక టీమ్ ఇండియా టైటిల్ వేట ఈ నెల 14న పొరుగు దేశం పాకిస్తాన్‌తో పోరుతో ఆరంభం కానుంది. 17న నెదర్లాండ్స్‌తో, 2న దక్షిణాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ర్టేలియాతో భారత్ తలపడనుంది.



