Friday, June 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమైత్రి డ్రగ్స్‌లో మృత్యుఘంటికలు..?

మైత్రి డ్రగ్స్‌లో మృత్యుఘంటికలు..?

- Advertisement -

నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఓ యువ కార్మికుడి ప్రాణాన్ని బలిగొన్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కసాల గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ (25) విధులు నిర్వహిస్తుండగా ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. సమాచారం ప్రకారం మూడు రోజుల క్రితమే పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పటికీ విషయం బయటకు రాకుండా యాజమాన్యం ప్రయత్నించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన కార్మికుడిని తొలుత సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అనంతరం పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

ఘటనపై అధికారిక ప్రకటన లేకపోవడం, ప్రమాదానికి గల కారణాలు వెల్లడికాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలవుతున్నాయా? కార్మికుల ప్రాణాలకు రక్షణ ఉందా? అనే ప్రశ్నలు స్థానికులు, కార్మిక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కార్మికుడు మృతి చెందిన తర్వాతే విషయం వెలుగులోకి రావడం మరిన్ని సందేహాలకు కారణమవుతోంది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని సీఐటీయూ, కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో జరిగిన ఈ ఘటన పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -