మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో దశ
చివరి రోజూ ప్రతిపక్షాల ఆందోళనలు
అమెరికాతో ట్రేడ్ డీల్, ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై నిరసనలు
పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీసిన సభ్యులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను, భద్రతను తాకట్టు పెట్టిందని ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేసిన తొలి దశ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, కేంద్ర బడ్జెట్‌పై చర్చ ఉభయ సభల్లో జరిగింది. ఈ రెండు అంశాలపై చర్చల సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. లోక్‌సభలో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ బిల్లు ఆమోదం పొందింది.
మార్చి 9 నుంచి రెండో దశ
మార్చి 9న ప్రారంభ కానున్న రెండో దశ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. శుక్రవారంనాడు ప్రతిపక్షాలు పార్లమెంటు లోపల, వెలుపల ఆందోళన చేపట్టాయి. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందంలోని రహస్యాలను తొలగించడం, ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవాణే పుస్తకంలోని వివాదాస్పద భాగాలను చర్చించడం, తీవ్ర సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైళ్లలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల పేర్లు ప్రస్తావనకు రావడం వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి.
నా ప్రసంగంలో ఎక్కువ భాగం రికార్డు నుంచి తొలగించడం సరికాదు : ఖర్గే
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా తన ప్రసంగంలో ఎక్కువ భాగాన్ని రికార్డు నుంచి తొలగించాలనే చర్యను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకించారు. రాజ్యసభ చైర్మెన్ సి.పి రాధాకృష్ణన్ ఈ చర్యను ఉపసంహరించుకోవాలన్న ఖర్గే డిమాండ్‌ను తిరస్కరించారు.
ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనలు
శుక్రవారం లోక్‌సభ సమావేశమైనప్పుడు, ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. సభ్యులు హోరెత్తిన నినాదాలతో వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ ఓంబిర్లాకు బదులుగా సభను నిర్వహించిన సంధ్యారే, ప్రతిపక్షాలను శాంతించాలని పదేపదే కోరారు. కానీ ఫలితం లేకపోయింది. దీని తరువాత, సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు, కేంద్రమంత్రులు తమ విభాగాలకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు సంధ్యారే ప్రకటించారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, రాజ్యసభ కూడా మార్చి 9 వరకు వాయిదా పడింది.
‘రాహుల్ సభ్యత్వ రద్దు తీర్మానంపై ఆ తరువాతే నిర్ణయం’
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సభ్యుడు దాఖలు చేసిన నోటీసుపై స్పీకర్‌ను సంప్రదించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మొదట్లో హక్కుల ఉల్లంఘన కింద రాహుల్‌పై నోటీసు జారీ చేయాలని అనుకున్నారు. ఈ సందర్భంగానే బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే రాహుల్‌పై ఒక ముఖ్యమైన తీర్మాన నోటీసు ఇచ్చారు. స్పీకర్‌తో సంప్రదించి ఈ విషయాన్ని హౌస్ ప్రివిలేజెస్ కమిటీకి లేదా ఎథిక్స్ కమిటీకి సూచించాలా లేదా నేరుగా లోక్‌సభకు తీసుకురావాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటానని కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు.
‘కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌ను తొలగించాలి’
బడ్జెట్ సమావేశాల మొదటి, రెండో దశల మధ్య మూడు వారాల విరామం ఉంది. ఈ విరామ సమయంలో, పార్లమెంటరీ కమిటీలు వివిధ విభాగాలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులను పరిశీలిస్తాయి. ఇండియా-అమెరికా ‘ట్రాప్ డీల్’ను రద్దు చేయాలని, ప్రసిద్ధ బాలల వేధింపుల నేరస్థుడు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయని బహిరంగంగా అంగీకరించిన కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు వెలుపల నిరసన తెలిపాయి.



