– దశాబ్దాల నిరీక్షణ.. మున్సిపాలిటీ అయినా మారని తలరాత! వైస్ చైర్మన్ పదవికైనా దక్కేనా సామాజిక న్యాయం..?
– దళిత నాయకులు కేవలం వార్డు సభ్యులుగా
– లేదా ప్రధాన పార్టీల అనుచరులుగానే మిగిలిపోవాలా…?
నవతెలంగాణ-మక్తల్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఒక విచిత్రమైన, విచారకరమైన పరిస్థితి నెలకొంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కాగితాలకే పరిమితమవుతున్నాయా? అన్న సందేహం ఇక్కడి దళిత సామాజిక వర్గంలో వ్యక్తమవుతోంది. గ్రామ పంచాయితీ కాలం నుండి నేటి మున్సిపాలిటీ వరకు, మక్తల్ పీఠం దళితులకు “అందని ద్రాక్ష”గానే మిగిలిపోయింది.
పంచాయితీ నుంచి మున్సిపాలిటీ దాకా.. అదే వివక్ష!
1950వ దశకంలో గ్రామ పంచాయితీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మక్తల్‌లో ఎందరో సర్పంచ్‌లు మారారు, పాలకవర్గాలు మారాయి. కానీ, ఏనాడూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా గానీ, కనీసం ఉప సర్పంచ్‌గా గానీ బాధ్యతలు చేపట్టే అవకాశం రాలేదు.
వార్డులకే పరిమితం: ఇక్కడి రాజకీయ సమీకరణాలు, రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్ల మాయాజాలంలో దళిత నాయకులు కేవలం వార్డు సభ్యులుగా లేదా ప్రధాన పార్టీల అనుచరులుగానే మిగిలిపోవాల్సి వస్తోంది.
మున్సిపాలిటీగా మారినా తీరని లోటు: పంచాయితీ మున్సిపాలిటీగా పదోన్నతి పొందితే తమ తలరాత మారుతుందని ఆశించిన దళిత వర్గాలకు, తొలి, మలి ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల కేటాయింపు నిరాశనే మిగిల్చింది.
ఓటర్లుగా ఉన్నా.. ఓనర్లు కాలేరా?
మక్తల్ మున్సిపాలిటీలో దాదాపు 18% పైగా జనాభా కలిగిన ఎస్సీ సామాజిక వర్గం, ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయిలో ఉంది. అయినప్పటికీ, “రొటేషన్ పద్ధతి” పేరుతో అత్యున్నత పీఠం వీరికి దక్కకుండా పోతోందన్నది స్థానిక నేతల ఆరోపణ.
“మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప, పాలనా పగ్గాలు అప్పగించే విషయంలో అన్ని పార్టీలు విఫలమవుతున్నాయి” అని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేపటి ఎన్నికలు: కాంగ్రెస్‌లో దళిత గళం బలపడుతుందా?
సోమవారం జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈసారి రాజకీయ చిత్రం ఇలా ఉంది:
కాంగ్రెస్ గెలిచిన 12 స్థానాల్లో, 3, 10వ వార్డుల్లో దళిత అభ్యర్థులు జనరల్ స్థానాల నుండి పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. మరో ఇద్దరు రిజర్వేషన్ కోటాలో 5, 8 వార్డులలో గెలిచారు. అంటే పార్టీ బలాబలాల్లో దళిత సామాజిక వర్గం కీలకంగా ఉంది.
డిమాండ్: వైస్ చైర్మన్ పదవికైనా మొగ్గు చూపేనా?
చైర్మన్ పదవి రిజర్వేషన్ల పరంగా దక్కకపోయినా, కనీసం వైస్ చైర్మన్ పదవినైనా దళిత సామాజిక వర్గానికి కేటాయించి ‘సామాజిక న్యాయం’ చేయాలని ఆ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది.
జనరల్ స్థానాల్లో గెలిచిన సత్తా ఉన్న తమకు, పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వకపోతే తిరుగుబాటుకు కూడా వెనుకాడరాదని కొందరు సామజిక వర్గం సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన గౌరవం కోసం ఈసారి గట్టిగా పోరాడాలని దళిత నాయకత్వం నిర్ణయించుకుంది.
మక్తల్ గడ్డపై దళిత నాయకత్వం మున్సిపల్ పీఠాన్ని అధిరోహించాలంటే, అది రాజకీయ పార్టీల చిత్తశుద్ధి మీద మాత్రమే ఆధారపడి ఉంది. మరి సోమవారం జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయం వైపు నిలబడుతుందో లేదో చూడాలి.



