నవతెలంగాణ- తుంగతుర్తి
జీవన పయనంలో ఎంతమంది కలిసినా పాఠశాల మిత్రులు ఎప్పటికీ ప్రత్యేకమే. దీర్ఘకాలం ఒకే బడిలో చదువుకోవడంతో ఎంతకాలమైనా అప్పటి జ్ఞాపకాలు మదిలో ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. ఆ స్నేహ బంధానికి అంతం ఉండదు. పంతాలు పట్టింపులు అసలే ఉండవు. అందుకే పదో తరగతి చదువుకున్న ఎక్కువ మంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటారు. అలాంటిదే 37 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. మండల పరిధిలోని అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988- 89 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య ,స్థానిక గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డిలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాక్రిష్ణ,సరస్వతి మాత చిత్రపటాలకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.తమకు విద్య నేర్పిన గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు.
37 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి పాఠశాల రోజులను, గురువుల బోధనలను స్నేహబంధాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పితమ జీవితాలకు దిశా నిర్దేశం చేసిన ఆనాటి ఉపాధ్యాయులైన కృష్ణమాచార్యులు, ఆసనబాద సోమయ్య, కస్తూరి ప్రభాకర్, జయప్రకాశ్ లను జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. గురువుల సేవలను కొనియాడుతూ వారి బోధన వల్లే తాము వివిధ రంగాల్లో ఈనాడు స్థిరపడ్డామని పూర్వ విద్యార్థులు విద్య నేర్పిన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. మేము చదివిన పాఠశాల తమ జీవితాల్లో కీలక మలుపని ఇక్కడ పొందిన విద్య విలువ లేని తమ విజయాలకు పునాది అని కొనియాడారు.
తమ శిష్యులను చూసి ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. పరస్పరం ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరించుకున్నామనే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. ఒకే వేదికపై కలుసుకోవడం, సరదాగా గడపడం, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కొండంత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన సుమారు 35 మంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో గురువుల పాత్ర అనిర్వచనీయమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నలమాస వెంకన్న, బింగి లక్ష్మయ్య, ఈగ శ్రీనివాస్, బింగి వెంకటేశ్వర్లు, కొడకండ్ల శ్రీదేవి,మల్లిపెద్ది శ్రీనివాస్ రెడ్డి,మల్లె ప్రసాద్,మధురాంరెడ్డి, మల్లారెడ్డి,సత్యనారాయణ, యాదగిరి, రవిచంద్రారెడ్డి ,కృష్ణయ్య , నరసయ్య,వాణి, సుధారాణి, సరోజ, అరుణ,బోజ్జమ్మ, జ్యోతి, హేమలత, సుకన్య, స్వరూప, నరసమ్మ, వినోద,రమేష్ , రామిని వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, లింగయ్య, ఇద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.



