అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు యాజమాన్యం కృషి చేయాలి: వక్తలు
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల కేంద్రంలో గల షైన్ హై స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోనకల్ ఉప సర్పంచ్ బానోత్ కొండ, రావినూతల సర్పంచ్ భూక్య బద్రునాయక్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తల్లిదండ్రులు పెద్దమొత్తం లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు వేశాధారణలు అందరిని ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళా ప్రదర్శనలు అద్భుతంగా నిలిచాయి. చిన్నారులు అయినప్పటికీ ఎంతో అనుభవం కలిగిన కళాకారులుగా తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అబ్బురపరిచారు. ఆధ్యాంతం కళాత్మకంగా చిన్నారులు తమ కళా పోషణను ప్రదర్శించారు. వివిధ వేషధారణలో కూడా చిన్నారులు ఔరా అనిపించారు.
వివిధ పాటలకు అనుగుణంగా చిన్నారులు నిత్యం చేస్తూ సభికులను ఆనందపరిచారు. కొన్ని చిన్నారుల కళారూపాల ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని చిన్నారులు తమ కళారూపాల ద్వారా ప్రతిభను చాటుకొని నిరూపించుకున్నారు. అనంతరం భూక్యా బద్రు నాయక్, బానోత్ కొండ మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు షైన్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలలో మంచి ఫలితాలు సాధించినందుకు యజమాన్యానికి, ఉపాధ్యాయులకి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని, షైన్ హై స్కూల్ అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
తమ నుంచి ఏ సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. కరెస్పాండంట్ షేక్ అన్సర్ పాషా మాట్లాడుతూ మా షైన్ హై స్కూల్ ఎప్పుడు పిల్లల బంగారు భవిషత్తు కోసం బాటలు వేస్తుందన్నారు. విద్యార్థుల కి నాణ్యమైన విద్యను అందించడమే మా స్కూల్ లక్ష్యం అన్నారు. డైరెక్టర్ షేక్ లాల్ మహమ్మద్ మాట్లాడుతూ షైన్ హై స్కూల్ మీద తల్లిదండ్రులు ఎప్పుడు ఆదరాభిమానాలు చూపిస్తున్నారన్నారు. వారి ఆదరణ, ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల అండదండలు, సహకారం ఉంటే మంచి ఫలితాలు సాధిస్తాం అన్నారు. బానోత్ కొండ, భూక్యా భద్రునాయక్ లను యాజమాన్యం ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అయిటిపాముల శ్వేత, అడ్మినిస్ట్రేటర్ డేగల వేలాద్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.



