Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతి సభ 

అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతి సభ 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
ఎం సి పి ఐ ( యు ) పోలిట్ బ్యూరో సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరత్వం పొందిన అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్  నాలుగో వర్ధంతి సభ శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డ్ రమేష్‌పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం సి పి ఐ ( యు ) రాష్ట్ర కమిటీ సభ్యులు జబ్బర్ నాయక్ మాట్లాడుతూ  ప్రస్తుతం దేశంలో , రాష్ట్రంలో ప్రజలకు అనుకూలమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థను అందించడంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజలపై అధిక పన్నుల భారాలు మోపబడుతున్నాయని, నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతోందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని తెలిపారు.

రైతులు, కార్మికుల హక్కులు, చట్టాలు కలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం రంగాలు కార్పొరేట్ సంస్థల చేతుల్లో బందీగా మారాయని, మహిళలు, దళితులు, గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మనువాదం పేరుతో మతోన్మాదం ప్రజలపై బుస కొడుతోందని, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రతినిధులు ఆర్థిక, రాజకీయ నేరస్తులుగా మారుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

కామ్రేడ్ తాండ్ర కుమార్ పటేల్ – పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, రాష్ట్రం మరియు దేశంలో ఎం సి పి ఐ ( యు )  పార్టీని రాజకీయంగా, సైద్ధాంతికంగా బలంగా నిలబెట్టడంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. హైదరాబాద్ మహానగరంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల స్వాధీన పోరాటంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని, నిలువనీడలేని అణగారిన వర్గాలకు నీడ కల్పించేందుకు ముందుండి పోరాడిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ ( యు )  జిల్లా కమిటీ సభ్యులు సదానందం, జిల్లా నాయకులు సత్తయ్య, అరుణ్, నరేష్, సునీత, ఆస్మా, కొమరవ్వ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -