ప్రపంచవ్యాప్తంగా మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ప్రజలు ఇప్పుడు ఒక్క ప్రభుత్వంపై తమ ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా వదిలేయడం లేదు. తమకే తాము భద్రతను ఏర్పరచుకోవాలనే ఆలోచన బలపడుతోంది. చిన్న పెట్టుబడులు, పింఛన్ పథకాలు, బీమాలు, ఆరోగ్య భద్రతా చర్యలు అన్నీ వ్యక్తిగత జీవితంలో భాగంగా మారుతున్నాయి. ఒకప్పుడు ‘ప్రభుత్వం చూసుకుంటుంది’ అనే భావన ఉండేది. ఇప్పుడు ‘మనమే చూసుకోవాలి’ అనే వాస్తవం ప్రజలను మెల్లగా స్పృశిస్తోంది.
అక్కడక్కడా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, వాణిజ్య వివాదాలు, మహమ్మారి లాంటి అనూహ్య పరిణామాలు ప్రజల ఆర్థిక ఆలోచనలను మరింత జాగ్రత్తగా మార్చేశాయి. సంపాదన ఒక్క రోజులో ఆగిపోవచ్చని, వ్యాపారాలు ఒక్కసారిగా మూతపడవచ్చని, ఉద్యోగాలు క్షణాల్లో పోవచ్చని ప్రపంచం నేర్చుకుంది. అందుకే ఇప్పుడు రాబడి కంటే భద్రతకు ఎక్కువ విలువ ఇస్తున్న దృక్పథం పెరుగుతోంది. మొత్తానికి ప్రపంచం ఒక కొత్త ఆర్థిక మనస్తత్వం వైపు వెళ్లుతోంది. దోచుకోవడం కాదు, నిలబెట్టుకోవడం; ఖర్చు చేయడం కాదు, నిర్వహించడం; ఇప్పటికి మాత్రమే కాదు, రేపటికి కూడా ఆలోచించడం అనే దిశగా ప్రజల ఆలోచనలు మలుపు తిరుగుతున్నాయి.
మన దేశంలోనూ ఈ మార్పు పూర్తిగా రావడానికి ఇంకా కొంత కాలం పడుతుంది. కానీ పట్టణాల నుంచి గ్రామాల వరకు ఆలోచనల తీరులో వచ్చిన మార్పు చూస్తే, భారతీయ సమాజం కూడా ప్రపంచ ఆర్థిక ప్రవాహాలకు సరిసమానంగా అడుగులు వేస్తోందని అనిపిస్తుంది. డబ్బు జీవనానికి అవసరమే కానీ అదే జీవితం కాకూడదన్న నిశ్శబ్ద సందేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సుల్లో నెమ్మదిగా, స్పష్టంగా ముద్ర వేస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఉద్యోగాల కోసం తీసుకుంటున్న దారిని ఒక్క మాటలో చెప్పాలంటే అది కేవలం అధిక జీతాల కోసం మాత్రమే సాగుతున్న ప్రయాణం కాదు. ఆ ప్రయాణం వెనక భద్రత, గౌరవం, స్థిరత్వం, స్వేచ్ఛ, సృజనాత్మక గుర్తింపు వంటి అనేక లోతైన ఆకాంక్షలు కలిసి నడుస్తున్నాయి.
ఒకప్పుడు ఉద్యోగం అంటే కుటుంబానికి ఆధారం, సమాజంలో గుర్తింపు, జీవితానికి స్థిరత్వం అనే మూడు మాటల్లో ఇమిడిపోయేది. ఇప్పుడు ఉద్యోగం అంటే వ్యక్తిగత స్వప్నాలకు రెక్కలు, ప్రపంచాన్ని తన చేతుల్లోకి తెచ్చుకోవాలనే ధైర్యం, రేపటి జీవితంపై తానే నియంత్రణ పెట్టుకోవాలనే తపనగా మారిపోయింది. విదేశాలకు వెళ్లే ప్రతి యువకుడి వెనక లక్షల రూపాయల జీతం అనే ఒక్క కారణమే ఉంటుందని అనుకునేవాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. కానీ వాస్తవం అంత సాదాసీదాగా లేదు. వేతనం ఒక ముఖ్యమైన అంశమే కానీ అది ఒక్కటే అంతిమ లక్ష్యంగా ఉండడం లేదు. అక్కడి పని పరిస్థితులు, పని సమయాలు, వ్యక్తిగత జీవితానికి ఇచ్చే ప్రాధాన్యం, పనిలో ఉన్న స్వేచ్ఛ, నైపుణ్యానికి ఇచ్చే గౌరవం, ఎదగడానికి ఉన్న స్పష్టమైన మార్గాలు – ఇవన్నీ యువతను అంతర్జాతీయ వేదికల వైపు ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలు. ఒక చోట ఎంత జీతం వస్తుందన్నదికంటే, ఆ జీతంతో జీవితం ఎలా గడుస్తుందన్న ప్రశ్న వాళ్ల ముందుంటోంది.
అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు యువత వెళ్లడానికి అక్కడ ఉన్న సౌకర్యాలు మాత్రమే కాదు, అక్కడ పని చేసే విధానం కూడా పెద్దగా ప్రభావం చూపుతోంది. ఇక్కడ చాలాచోట్ల ఇంకా పని అంటే ఒత్తిడి, భయం, అధిక పనిగంటలు, వ్యక్తిగత జీవితం లేని రోజులు అనే భావన చుట్టే తిరుగుతోంది. కానీ అక్కడ పని అంటే ఒక జీవన శైలి, వ్యక్తిగత సమయానికి గౌరవం, మానసిక ఆరోగ్యానికి విలువ ఇచ్చే విధానం కనిపిస్తోంది. ఈ తేడానే యువతను తమ ఊళ్లు, తమ ఇళ్లు వదిలి వెళ్లేలా చేస్తున్న ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది. ఈ పరిస్థితులకు పరిష్కారం పూర్తిగా యువత దేశం విడిచిపోవడమే కాదని ఇప్పుడు సమాజం గ్రహించాలి.
ఇక్కడే యువతకు గౌరవప్రదమైన ఉపాధి, సురక్షితమైన పని వాతావరణం, నైపుణ్యానికి తగిన విలువ, మానసిక ప్రశాంతత కలిగించే ఉద్యోగ విధానాలు ఏర్పడితే వలసల ఒత్తిడి సహజంగా తగ్గుతుంది. ప్రభుత్వాలు కేవలం ఉద్యోగాలు సృష్టించడం కాదు, వాటి నాణ్యతను పెంచే దిశగా ఆలోచించాలి. ప్రైవేట్ రంగం యువతను తక్కువ జీతం–ఎక్కువ పనిగంటల చక్రంలో నెట్టకుండా, మానవీయ పని సంస్కృతి వైపు అడుగులు వేయాలి. విద్యా వ్యవస్థ కూడా మార్కెట్‌కు అనుగుణమైన నైపుణ్యాలను యువతలో చిన్న వయసులోనే నాటగలిగితే, వారు స్వదేశంలోనే ప్రపంచ స్థాయి అవకాశాలు సృష్టించుకునే స్థితికి చేరుకుంటారు. అప్పుడే ‘ఉద్యోగం కోసం దేశం విడిచే పరిస్థితి’ నుంచి ‘ఉద్యోగాల కోసం ప్రపంచమే మన దేశం వైపు చూసే పరిస్థితి’కి భారతదేశం అడుగులు వేయగలదు.
చిటికెన కిరణ్ కుమార్, 9490841284


