అప్పుడే అయిదు వార్షికాలు దాటినవి. ఇద్దరికీ ఆ లోటు తెలుస్తూనే వుంది. తను ఎప్పుడూ అత్తమ్మా (అత్త + అమ్మ) అంటూ అమ్మగా చూసుకునేది. తను అమ్మకు కనురెప్పైనది. మరి… అమ్మ ఆలోచనలలో మగ్గుతున్నాను. మగ్గడమంటే సీతాఫలాలు గడ్డి మధ్యలో పెట్టినట్టుగా కాకుండా, మనసుపొరలలో దాచుకున్న అమ్మ ఆత్మీయతల వస్త్రాలలో కాగుతున్నాను. కాగా భౌతిక వెలితి, జీవనములో వెలితిగానే మిగిలిపోయింది.
అప్పుడెందుకో… ఒక ఆలోచన ఆలోచన గానే ఉండిపోయింది. ఆ ఆలోచన వింటే ఎవరైనా నవ్వుకుంటారేమోననీ, తేలికనవుతానని అనిపించేది. డెబ్భై సంవత్సరాల వయసులో ఇదేమి కోరిక అంటారేమో! ఇంతకీ అదేమిటంటారా… అమ్మ ఒడిలో తలపెట్టుకుందామనీ, అయిదు నిమిషాలు గడుపుదామని. కాని ఆ శుష్కించిన దేహం నాతల బరువు తట్టుకుంటుందా అనే ఒక ఆలోచన. అలా ఆలోచన తీరని ఆశే అయింది. మనసులో అదే మెరుస్తుంది. మూగబోతోంది. గొంతులో గుర గురలాడుతూనే ఉంది. శరీరం కుదించుకుపోతూనే ఉంది. ”ఏమండి… మా అమ్మను చూసొద్దామా! మంచములోనే అన్నీ నడుస్తున్నాయట.” ”సరే పోదాం… తను నాలాగే వాండ్లమ్మ గురించి తపన పడుతుంది కదా!”
తన చెల్లెలు ఇంట్లో ఉన్న మా అత్త గారిని చూడడానికి వెళుతూ… చెల్లి ఆర్థిక ఇబ్బందులు తలుచుకుని, తనవంతు కర్తవ్యంగా న్యూట్రిషన్ ఫుడ్, డైపర్లు, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు ఒక నెల రోజులు సరిపోయేలా తీసుకుంది. వాటితోపాటు కొన్ని పండ్లు కూడా. ఆరోజంతా తను తన తల్లిని చూసుకుంటూ తన కళ్ళలో వెలుగులు నింపుకుంది. ఆ వెలుగులలోని మెరుపులు చూసి నాకు కూడా ఆనందం కలిగింది. నేను మా అమ్మ దగ్గర పొందలేనిది తను అందుకున్నదని, ఆ పెద్దావిడ కూడా బిడ్డను చూసుకుని సంతోషపడింది. ఆ సంతోషం రెండు నెలలు గడవకముందే మా అత్తగారు కనుమరుగైంది.
అమ్మ లేని లోటును అనుభవిస్తూ ముందుకు సాగుతున్న నా జీవితం ఒక్కసారిగా కుదేలైంది. తను కురిపించిన ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ సువాసనలు లేని మల్లెల మాదిరయినది. ఆ మల్లెల పరిమళాలు తనవిగా చేసుకుని జ్యేష్ఠ శుద్ధ షష్టి పౌర్ణమి ఆరవదశను దర్శించుకుంటూ కృష్ణ దర్శనార్థం వెళ్ళింది తను. ఆ నెమ్మదితనము, సౌజన్యమును ఆస్వాదించడములో మునిగిన నేనిప్పుడు? కాలప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. జీవనగమనంలో యానం ఎగుడుదిగుడులైనా! జీవి ఉన్నంత వరకు తను అందించిన అనురాగాన్ని స్నేహరాగముగా మలచుకుంటూ, నీలమోహనములో తరించడం తప్ప.
- టి. శ్రీరంగస్వామి, 99498 57955



