నవతెలంగాణ – కాటారం
స్థానిక గిరిజన బాలుర గురుకుల కళాశాల, కాటారంలో ఆదివారం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాడ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్యలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా రాంజినాయక్ తండాలో భీమనాయక్, ధర్మినిబాయి దంపతులకు జన్మించిన సద్గురు సంత్ సేవాలాల్ సామాన్యుడిగా పుట్టి అసామాన్య మహానుభావుడిగా ఎదిగిన గొప్ప మహనీయుడని వారు పేర్కొన్నారు. ఆయన జీవన విధానం, సేవా తత్వం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ సందర్భంగా గెస్ట్/పార్ట్ టైం యూనియన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు మాట్లాడుతూ.. 10 కోట్ల బంజారా ప్రజల ఆరాధ్య దైవంగా సద్గురు సంత్ సేవాలాల్ నిలిచారని తెలిపారు. ఆయన చూపిన బాటలో నేటి బంజారా సమాజం నడుస్తోందని, విద్యార్థులు కూడా ఆ మార్గంలో సాగాలని సూచించారు. బంజారా సమాజం ప్రత్యేక లిపి, ప్రత్యేక దుస్తులు, ఆభరణాలతో ప్రత్యేక జీవన విధానాన్ని కొనసాగిస్తూ ప్రకృతి సిద్ధంగా జీవిస్తున్నట్లు వివరించారు.
మహాశివరాత్రి సందర్భంగా విద్యార్థులకు స్వీట్ సేమియా, కందగడ్డ, సంత్ర, పుచ్చకాయ, అంగూర, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాములు, డిప్యూటీ వార్డెన్ రాజబాబు, నాగమణి, బిసుల పద్మ, భూక్య రాజు, వెంకట్రామిరెడ్డి, జక్కు వంశీకృష్ణ, ఉపాధ్యాయ బృందం, పీడీ, పీ ఈటి కోచ్‌లు, బోధనేతర సిబ్బంది పెండ్యాల సత్యనారాయణ, హాట్కర్ రాజు, బీసుల శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు.



