Monday, June 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ

పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ తన సొంతూరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తన ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 180 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేశారు. 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు ఆయన అర్ధాంగి, నటి రష్మిక మందన్న, తల్లి మాధవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా విద్యాధికారి రమేష్ తదితరులు హాజరయ్యారు.

రష్మిక మందన్న మాట్లాడుతూ, “ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మంచి పని చేయాలనుకున్నప్పుడు, మొదట మామయ్య పుట్టిన ఊరి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. మీరంతా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా చేశారు. జీవితంలో గెలుపోటములు సహజం, కానీ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించి గొప్ప స్థాయికి ఎదగాలి” అని విద్యార్థులకు సూచించారు.

అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మీ విజయాన్ని సెలబ్రేట్ చేయడానికే ఈ కార్యక్రమం చేపట్టాం. మార్కుల కన్నా, వాటిని సాధించడానికి మీరు పడిన శ్రమ, ఏకాగ్రత చాలా గొప్పవి. జీవితంలో ఫోకస్, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. నేను, రష్మిక మా స్టూడెంట్ లైఫ్‌లో ర్యాంకర్స్ కాదు. కానీ మీ విజయాన్ని చూసి గర్వపడుతున్నాం. ఈసారి ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఈ ఘనత ఉపాధ్యాయులదే” అని అన్నారు.

“మా తల్లిదండ్రులు ఈ ఊరితో పెంచుకున్న అనుబంధం వల్లే నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఇప్పుడు అచ్చంపేటలో ప్రారంభించాం. భవిష్యత్తులో నాగర్‌కర్నూల్ జిల్లా, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించాలనేది నా కల. ఈ ఉపకార వేతనాలు నిజమైన అర్హులకు మాత్రమే చేరేలా చూడాలని విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను కోరుతున్నాను. ఇది దుర్వినియోగం అయితే నేను చాలా బాధపడతా” అని స్పష్టం చేశారు. కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -