Monday, June 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్యా వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలి

విద్యా వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలి

- Advertisement -

పేదలకు ఇండ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి
రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలి :
సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర
కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు

నవతెలంగాణ-నయీంనగర్
ప్రజల ప్రాథమిక హక్కులైన ఉచిత విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు నిరుద్యోగం, ఇండ్లు, ఇంటి స్థలాల వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల చక్రపాణి అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. పాఠశాలల్లో తరగతి గదులు, ఫర్నిచర్, టాయిలెట్లు, కాంపౌండ్ వాల్స్, క్రీడా సామగ్రి, లైబ్రరీలు వంటి మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రయివేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావడంలో విఫలమైందని అన్నారు. ప్రభుత్వ వైద్య రంగం పట్ల పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు.వైద్య ఖర్చులు భరించలేక అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కాబట్టి ప్రయివేటు ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఇంటి స్థలాలు లేని వారికి స్థలాలు, పట్టాలు, గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, నిరుద్యోగం, ఇండ్లు, ఇంటి స్థలాలు, పేదలకు రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ.. తదితర ప్రజా సమస్యలపై ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతామని తెలిపారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. చుక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు టి. ఉప్పలయ్య, గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, మంద సంపత్, ఎల్. దీప, కె. లింగయ్య, వేలు రజిత, జిల్లా నాయకులు జి. రాములు, ఓరుగంటి సాంబయ్య, గాదె రమేశ్‌, పెండ్యాల రవి, మంద మల్లేశం, కారు ఉపేందర్, కుక్కమూడి రవీందర్, ఎం. రమాదేవి, అరుణ, రాధిక, రమాతార తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -