Monday, February 16, 2026
E-PAPER
Homeదర్వాజనిబద్ధతగా చేసిన రచన

నిబద్ధతగా చేసిన రచన

- Advertisement -

వర్తమాన కాలంలో సమాజాన్ని చెడగొట్టడానికి సినిమా రంగం పనిచేస్తున్నదని అందరూ అనుకుంటున్న మాట. సమాజము, సినిమా ఈ రెండు ఏ రకంగా పరస్పరం ప్రభావితం అవుతున్నాయన్నది చాలా కాలంగా సాగుతున్న ఒక చర్చ.

ఈ క్రమంలో సినిమా రంగానికి తొలినాళ్లలో పాదులు వేసిన మహనీయుల గురించిన జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో రావలసిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే సినిమా రంగం స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో సమాజాన్ని తనదైన బాధ్యతతో ప్రభావితం చేసింది. స్వాతంత్య్ర ఉద్యమ ప్రాధాన్యతను అవసరాన్ని తొలతగా గుర్తించిన ఏదైనా కళారూపం ఉన్నదంటే అందులో మొదట సాహిత్యం, నాటక రంగాలైతే ఆ తర్వాత చెప్పుకో దగింది సినిమా రంగమే.
స్వాతంత్య్రానంతరమూ సినిమా రంగం తెలుగు సమాజంపై తనదైన ప్రభావాన్ని చూపింది. సినిమా రంగంలో విఖ్యాతులైన ఎన్టీ రామారావు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని నెలకొల్పి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా తనదైన క్రియా శీలకమైన పాత్రను పోషించడం మనందరికీ తెలిసిందే. ఈ పరిణామాలన్నీ జరిగినవంటే సినిమా పరిశ్రమకు ఉన్న ప్రాముఖ్యత మనకు తేటతెల్లమవుతుంది. వర్తమాన కాలంలో సినిమా ప్రేక్షకులు హీరోలను ఏ స్థాయిలో అభిమానించి ప్రేమించి గౌరవిస్తున్నారో అన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే సినిమా అన్నది మన జీవితాల నుండి ఒక విడదీయలేని అంశంగా స్థిరపడిపోయిందనిపిస్తున్నది. ఇంత గొప్ప సినిమాకు సంబంధించిన చరిత్ర ఒక సమగ్రమైన దక్పథంతో రికార్డు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.


ఈ క్రమంలో హెచ్‌.రమేష్‌ బాబు తెలుగు టాకీ పితామహుడైనటువంటి హెచ్‌ఎం.రెడ్డి గారి గురించి ఒక సమగ్రమైన గ్రంథాన్ని తీసుకొస్తున్నాడు. రాయడం అంటే అలా వరుస పెట్టి రాయడం కాకుండా, తాను సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా ఒక పరిశోధనాత్మకంగా రాయడం ఈ రచనకు ఉన్న ప్రత్యేకత. నిజంగా హెచ్‌.ఎం. రెడ్డి గారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని చాలామందికి అనిపించవచ్చు. కానీ ఆయన తెలుగు, తమిళ భాషలకు మొట్టమొదటి టాకీ సినిమాలను తీసి దక్షిణ భారత టాకీ సినిమాలకు ఆద్యులుగా నిలిచారు. ఆయన తొలి భారతీయ టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ కు పనిచేసి ఉన్నారు. ఆ తర్వాత తొలి తమిళ టాకీ ‘కాళిదాస్‌’, తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’కు దర్శకులుగా పనిచేశారు. మద్రాస్‌ లో భారతీయ సినిమా రజతోత్సవాల సందర్భంగా హెచ్‌.ఎం. రెడ్డి గారిని ఘనంగా సత్కరించిన విషయం చరిత్రలో మరుపు రానిది. ఆ తర్వాత మేమంతా సెప్టెంబర్‌ 15న తెలుగు సినిమా ఆవిర్భావ దినోత్సవంగా దాసరి నారాయణరావు గారితో కలిసి జరుపుకునేవారము. అదంతా చరిత్ర. కాలక్రమంలో సినీ జర్నలిస్టు రెంటాల జయదేవ స్వయంగా ఒక పరిశోధన చేసి తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ విడుదలైంది 1931 కాదు. 1932 అని. తేదీలు, ఆధారాలతో సహా తేల్చి చెప్పారు. అతని కషి వలన తెలుగు సినిమా విడుదల తేదీని మార్చుకోవాల్సి వచ్చింది. మనకు తొలి తెలుగు సినిమాకు సంబంధించిన సరైన తేదీ ఏదో తేలడానికి ఒక 70 ఏళ్ల కాలం పట్టింది. ఈ అంశం సినిమా రంగ పరిశోధనలో ఉన్న మన వెనుకబాటు తనాన్ని సూచిస్తుంది.


ఈ కాలంలో మనం చరిత్రకు సంబంధించి చాలా అంశాలు వందలు వేల సంవత్సరాల క్రితం జరిగిన అంశాల పట్ల కూడా స్పష్టత లేకపోవడం వల్ల పలు వాద వివాదాలు జరుగుతున్నవి. కానీ ఇటీవలి 70 ఏళ్ల క్రింద జరిగిన తొలి తెలుగు సినిమా విడుదల తేదీ అంశంలో మనం సరి చేసుకోవడానికి ఇంతకాలం పట్టింది. అందుకే నిజాన్ని నిజంగా చెప్పడానికి సరైన చరిత్రకారుల అవసరం మనకు ఎంతైనా ఉన్నది. సినిమా రంగం తన రూపురేఖలను కార్యక్రమంగా మార్చుకొనవచ్చును. థియేటర్‌ నుండి టీవీలోకి, అటు నుండి ఓటీటీ ఇలా చాలా రూపాలను మార్చుకోవచ్చు. కానీ, వీటన్నిటికీ ఆద్యం థియేటర్లో చూసిన సినిమానే. చరిత్రలో తన తొలి నాటి రూపాన్ని మాత్రం మార్చుకొనలేదు. తొలినాటి సాంకేతిక నైపుణ్యానికి ఎవరు బాధ్యులు అన్న అంశం మన ముందుకు వచ్చినప్పుడు తెలుగు సినిమాకు సంబంధించి హెచ్‌. ఎం ఆద్యులుగా మనకు కనిపిస్తారు. ఇలాంటి గొప్ప వారి చరిత్రలు రాయడం మనకు చాలా అత్యవసరం. ఈ అంశంపై హెచ్‌. రమేష్‌ బాబు సీరియస్‌గా రీసెర్చ్‌ చేసి ఎక్కడిక ఆయన జన్మించిన ప్రాంతంతో మొదలుకొని మరణించే వరకు సాధికారికమైన పరిశోధనాత్మక రచన చేశారు. అందులో ఒక నిబద్ధత కూడా కనిపిస్తుంది. ఇందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ పరంపరలో తెలుగు సినిమాకు ఆద్యులైన వారి చాలామంది ప్రముఖుల జీవిత చరిత్రలు రావాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చరిత్రకు సంబంధించిన చాలా విషయాలు ఎవరికి వారు తమ తోచినట్లుగా అబద్దాలను, ఊహా జనితమైన అంశాలను వ్యాఖ్యానాలు చేస్తూ మాట్లాడు చరిత్రను వక్రీకరించడమే అవుతుంది. ప్రమాదం ఏమిటంటే చరిత్ర తెలియని వారు వీటినే నిజాలు అనుకునే అవకాశం ఉంది. ఇవే ప్రచారంలోకి వెళ్ళిపోయి నిజాలుగా చలామణి అయ్యే ప్రమాదం ఉంది. అందుకని వాస్తవాలు తెలియపరిచే ఇలాంటి పుస్తకాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు నాందిగా హెచ్‌. రమేష్‌ బాబు రాసిన హెచ్‌.ఎం. రెడ్డి జీవిత చరిత్రను తప్పకుండా మనమంతా చదవాలి. ఆయన అభినందించాలి.
తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు సినిమా దర్శకులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -