Monday, April 20, 2026
E-PAPER
Homeదర్వాజసంప్రదాయం - ఆధునికతల వారధి: కశప

సంప్రదాయం – ఆధునికతల వారధి: కశప

- Advertisement -

సాహిత్యం అనేది సమాజానికి అద్దం వంటిది. సమాజంలో జరుగుతున్న మార్పులను, మానవ సంబంధాలను, వృత్తిపరమైన సంక్షోభాలను అక్షరబద్ధం చేయడం ద్వారా పాఠకులలో ఆలోచన రేకెత్తించడమే ఉత్తమ సాహిత్యం. డాక్టర్‌ పి.వి.ఎన్‌. స్వామి ప్రముఖ కథా రచయిత. కథా విమర్శ వ్యాసాలు రాశారు. అయితే నిత్యం పరిశోధన, అన్వేషణ మార్గంలో ఉన్నవాళ్లు కొత్త మార్గాలను వెతుకుతారు. అలా ఆయన అన్వేషణలో నుంచి ‘కశప’ను మన కంటి ముందుకు తెచ్చారు. కశప అంటే ‘కథాశతక పద్యం. ఇది వారి సొంత ఆలోచన. ఒక కథ (వచన భాగం)’, దాని చివరలో ఒక శతక పద్యం ఉండటం అనేది పాఠకుడిపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల రచయిత ఆశించే అంశాలు, సాహిత్యంలో దీని ప్రయోగాత్మక విలువను చూద్దాం.

సమకాలీన సమస్యకు శాశ్వత పరిష్కారం: పైన ఉన్న కథ ‘ప్రస్తుత’ సామాజిక సమస్యను, క్రింద ఉన్న శతక పద్యం ‘సార్వకాలిక’ సత్యాన్ని చెబుతుంది. అంటే, సమస్య తాత్కాలికం కావొచ్చు కానీ, దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన నైతిక బలం శతక సాహిత్యంలో ఉందని రచయిత భావిస్తున్నారు. కథ చదువుతున్నప్పుడు పాఠకుడు భావోద్వేగానికి లోనవుతాడు. చివరలో పద్యం చదివినప్పుడు అతనికి ఒక స్పష్టమైన సందేశం లేదా నీతి అందుతుంది. ఇది పాఠకుడిని కేవలం కథకు పరిమితం చేయకుండా, ఒక ఉన్నతమైన ఆలోచన వైపు నడిపిస్తుంది. ఇందులో భావుకత, నీతి కలిసి ఉంటాయి.
ఆధునిక వచన శైలిలో ఉన్న కథను, ప్రాచీన ఛందస్సులో ఉన్న పద్యంతో ముగించడం ద్వారా… పాత, కొత్త తరాల సాహిత్య ప్రక్రియల మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పరచడం రచయిత ఉద్దేశ్యం. ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని రచయిత సంధానం చేస్తున్నారని గమనించాలి. డాక్టర్‌ స్వామి గారు మొదటి సంపుటంలో ప్రసిద్ధులైన వారి శతక పద్యాలను తీసుకున్నారు. అలాగే సమకాలీనంగా శతకాలు రాసిన వారి పద్యాలు తీసుకున్నారు. మొదటి సంపుటంలో కథకు తగిన ఇతరుల శతక పద్యాన్ని ఆయన ఎంపిక చేసుకుంటే, రెండవ సంపుటంలో కథకు తగిన పద్యాన్ని తానే రచించారు. బహుశా ఆయన మొదటి సంపుటంలో ముందుగా పద్యాన్ని అనుకొని తర్వాత కథ రాసి ఉండవచ్చు. రెండవ సంపుటంలో ముందు కథ రాసి తర్వాత పద్యాన్ని రాసి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ తానొక మార్గాన్ని ఎంచుకున్నారు, ఆ మార్గంలో రెండు సంపుటాలను సాహితీ లోకానికి పరిచయం చేశారు. ఈ పద్ధతిని వాడటం వల్ల పాఠకుడికి రెండు రకాల

అనుభూతులు కలుగుతాయి:
1. స్పష్టత: సంభాషణ చదువుతున్నప్పుడు మనసులో ఒక చిత్రం (Visual) ఏర్పడుతుంది.
2. ప్రభావం: చివరలో పద్యం చదవగానే, ఆ చర్చలోని అంతరార్థం ఒక బుల్లెట్‌లాగా మెదడుకు తగులుతుంది.
సాధారణంగా కథలు వేరుగా, శతకాలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ కథలోని సారాంశాన్ని ఒక పద్యంతో ధవీకరించడం అనేది కొత్త పద్ధతి. దీనిని లిలి”వచన-పద్య సంయుక్త ప్రక్రియ”లిలిగా అభివర్ణించవచ్చు. పురాణాల్లో లేదా ప్రబంధాల్లో కథా గమనం మధ్యలో పద్యాలు రావడం సహజం. కానీ, ఒక ఆధునిక సామాజిక కథకు ‘మకుటం’ లాగా ఒక శతక పద్యాన్ని వాడటం వల్ల ఆ కథకు ఒక ”శాస్త్రీయత” లేదా ”అధికారికత” వస్తుంది. కేవలం కథ చదివితే ఆ అనుభూతి కొంతసేపు ఉంటుంది. కానీ పద్యంలోని లయ, ప్రాస వల్ల ఆ నీతి పాఠకుడి మనసులో బలంగా ముద్రితమవుతుంది. తెలుగు సాహిత్యంలో శతక పద్యాలకు ఉన్న పట్టును రచయిత ఇక్కడ కథా విస్తరణకు వాడుకున్నారు. ఇలా చేయడం వల్ల పాఠకుడిలో బలమైన ముద్ర ఏర్పడుతుంది.
దానితోపాటు ఆయన ‘బుంగి’ అనే పాత్రను ఇందులో ప్రవేశపెట్టారు. ఈ బుంగి పాత్ర మనలో భావోద్వేగాలను కలిగిస్తుంది. బుంగి పాత్రను పాఠకుడు సొంతం చేసుకుంటాడు. బుంగి పాత్రతో తాదాత్మీకరణ చెందుతాడు. బుంగి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. బుంగి పాత్రలో సహానుభూతి చెందుతాడు. ‘బుంగి’ అనే పాత్ర ద్వారా బాధితుడిని ఓదార్చే ప్రయత్నం మానవత్వాన్ని చాటుతోంది. మనిషి ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదని, కుటుంబం కోసం బతకాలని చెప్పే ప్రయత్నం కొన్ని కథల్లో కనిపిస్తుంది.
ఈ ప్రక్రియలో వచన రూపంలో ఉన్న కథనం ఒక సమకాలీన సామాజిక సమస్యను లేదా ఒక వ్యక్తిగత వేదనను పాఠకుడి ముందు ఉంచితే, దాని వెనువెంటనే వచ్చే శతక పద్యం ఆ సంఘటనకు ఒక తాత్వికమైన ముగింపును ఇస్తోంది. రచయిత ఈ రెండింటి కలయిక ద్వారా పాఠకుడిలో కేవలం సానుభూతిని మాత్రమే కాకుండా, ఒక నైతిక స్పహను కలిగించాలని ఆశిస్తున్నారు.
సాహిత్యపరంగా ఇది ఖచ్చితంగా ఒక గొప్ప ప్రయోగం. ఎందుకంటే, ఇది ప్రాచీన ఛందస్సులో ఉన్న శతక సాహిత్యాన్ని ఆధునిక వచన సాహిత్యంతో అనుసంధానించే వంతెనలా పనిచేస్తోంది.
ప్రక్రియను లోతుగా పరిశీలిస్తే, ఇది కేవలం ఒక కథ, ఒక పద్యం అనే పరిధిని దాటి ‘సామాజిక-సాహిత్య సమన్వయం’ (Socio-Literary Synthesis) అనే కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఇది పాఠకుడిలో కేవలం సానుభూతిని మాత్రమే కాకుండా, లోతైన ఆత్మపరిశీలనను మరియు సామాజిక స్పహను పెంపొందిస్తుంది. అట్టడుగు వర్గాల అస్తిత్వ పోరాటాల నుండి మానసిక స్థితిగతుల వరకు ప్రతి అంశాన్ని అత్యంత సహజంగా, మాండలిక సొగసులతో ప్రతిబింబిస్తూ, చివరికి ఒక నైతిక మార్గాన్ని నిర్దేశించడమే ఈ ప్రక్రియలోని అసలైన వైశిష్ట్యం. ఇది తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న ప్రయోగంగా నిలవడమే కాకుండా, సామాన్య ప్రజలకు నైతిక విలువలను సులభంగా చేరవేసే ఒక బలమైన మాధ్యమంగా మారుతుంది.
ఉదాహరణకు: ‘బంగారు’
”ఆడంబరాలు అనివార్యమైన స్థితికి చేరుకున్నాయి” బుంగి బాధగా అన్నాడు. ”సెలబ్రిటీ కల్చర్‌ తప్పనిసరైన తంతు అయింది” అన్నాను.
”మా పెద్ద బాపు కొడుక్కి బిడ్డ పుట్టింది. పుట్టిన రోజు నుండి ఇరవై ఒకటి వరకు జరిగిన తతంగం నాకు ఆశ్చర్యాని కలిగించింది” అంటూ పాప ఫంక్షన్‌ విశేషాలు చెప్పడం మొదలుపెట్టాడు.
నామకరణం రోజు పట్టువస్త్రాలు, బంగారు నగలతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు అందరూ బయల్దేరారు. పాప తండ్రికి పుత్తడి బొమ్మ అయింది. ఏసీ చల్లదనాన్ని స్రవిస్తుంది. మనుషులు కాంతులీనుతున్నారు. పగలు, రాత్రి కాని వాతావరణం ఏర్పడింది. పలకరింపుల్లో అంచనాలు బయటపడుతున్నాయి. ఖరీదైన స్థితి పాపను ఉక్కిరి బిక్కిరి చేసింది. గిఫ్ట్‌ గోల, పెద్దల హేలలతో పాప ఏడుపు అందుకొంది. తల్లి చేతుల్లో నుండి తండ్రి ఒడిలోకి మారింది. డిన్నర్‌ మొదలయింది. బఫ్‌ సిస్టమ్‌లో పారవేయగలిగినంత పెట్టుకొని, తినగలిగినంత తింటున్నారు. తల్లి నవ్వుతూ అందర్నీ పలకరిస్తుంది. పాప ఏడుపు ఇంకా ఆపలేదు. ఆహార పానీయాల ఘుమఘుమలు ముక్కుపుటాలకు తాకి రుచులను తెలుపుతున్నాయి. పదిరకాల పదార్థాలు జిహ్వను పరుగులు పెట్టిస్తున్నాయి. పాపను ఊరడించడానికి గది నుండి బయటకు వచ్చాడతడు. మంద్రంగా గాలి వీచింది. నక్షత్ర కాంతి చల్లదనాన్నిచ్చింది. పిండి ఆరబోసినట్లున్న వెన్నెలకు, పాప కనులు తెరిచింది. హాయి గొలిపే గాలిలో, సుఖాన్నిచ్చే ఒడిలో పాప కేరింతలు కొట్టింది. పాపను చూసి ఏసీ గది వెలవెలబోయింది.
”ప్రియము లేని విందు పిండి వంటలు చేటు/ భక్తిలేని పూజ పత్రి చేటు/ పాత్ర మెరుగనీవి బంగారు చేటురా/ విశ్వదాభిరామ వినురవేమ”
‘బంగారు’ అనే శీర్షికతో ఆధునిక సమాజంలోని ఆడంబరాలకు, ప్రకతి సిద్ధమైన సౌకర్యానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని అత్యంత ప్రభావవంతంగా చిత్రీకరించిన తీరును చూద్దాం. ఈ కథనంలో రచయిత రెండు విభిన్న వాతావరణాలను పక్కపక్కన పెట్టి చూపారు:
1. కత్రిమ వాతావరణం: ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, ఏసీ చల్లదనం, భారీ నగలు, పట్టువస్త్రాలు మరియు ఖరీదైన గిఫ్టులు. ఇవన్నీ బయట ప్రపంచానికి గొప్పగా అనిపించినా, ఒక పసిపాపకు మాత్రం అవి ‘ఉక్కిరిబిక్కిరి’ కలిగించే అంశాలుగా మారాయి. ఇవి నగర విలాసాన్ని సూచిస్తాయి.
2. ప్రకతి వాతావరణం: హోటల్‌ గది నుండి బయటకు రాగానే తగిలిన మందపాటి గాలి, నక్షత్ర కాంతి, వెన్నెల. ఏసీ గదిలో ఏడ్చిన పాప, ప్రకతి ఒడిలోకి రాగానే హాయిగా నవ్వడం ద్వారా… కత్రిమ వసతుల కంటే ప్రకతి ఇచ్చే ఆనందం మిన్న అని రచయిత నిరూపించారు. ఇది ప్రకతి సౌందర్యాన్ని తెలుపుతుంది.
ప్రస్తుత కాలంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న ప్రదర్శన బుద్ధిని ఈ భాగం విమర్శిస్తుంది. ”ఆడంబరాలు అనివార్యమైన స్థితికి చేరుకున్నాయి” అన్న బుంగి మాటలు నేటి సామాజిక పోకడలకు అద్దం పడుతున్నాయి. పసిపాప నామకరణాన్ని కూడా ఒక ఈవెంట్‌లా మార్చి, హోటళ్లలో వేల రూపాయలు ఖర్చు చేస్తూ చేసే హడావుడి వల్ల అసలైన ఆనందం కరువవుతోందని ఇక్కడ మనకు అర్థమవుతుంది.
ప్రేమ, ఆప్యాయత లేని విందులో ఎన్ని పిండివంటలు ఉన్నా అవి వథా (చేటు). అలాగే భక్తి లేని పూజ, పాత్రత ఎరగని దానధర్మాలు (బంగారం ఇచ్చినా) ప్రయోజనం లేనివి. కథలో హోటల్‌ విందులో ఆడంబరాలు ఉన్నాయి కానీ, ఆ పాపకు కావాల్సిన ప్రశాంతత లేదు. అందుకే ఆ విందు ”చేటు” గానే పరిగణించబడింది.
”కథలు తెచ్చును మార్పును ఖచ్చితముగ/ యెదుటి వారల మనసులు యెరిగినంత/ రీతి తెలిసిన కథనము రిత్త కాదు/ కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము”
ఇలాంటి ఆశతో ఈ ప్రక్రియను చేపట్టిన స్వామి గారి లక్ష్యం నెరవేరాలని హదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ… కథలోని సజీవ చిత్రణ, పద్యంలోని తాత్విక గాంభీర్యం పాఠకుడిని ఆలోచింపజేయడమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దే శక్తిని కలిగి ఉన్నాయి. కాలం మారుతున్నా, మానవత్వపు విలువలు మారకూడదని చాటిచెప్పే ఈ ‘కాంతి పథం’ భావి తరాల రచయితలకు, పాఠకులకు ఒక దిక్సూచిగా నిలుస్తుందని ఆశిద్దాం.”

– డాక్టర్‌ సుంకర గోపాల్‌, 8555971630

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -