‘‘సత్యమేవ ప్రవాక్ష్యామి/ సత్యం ధ్యాయామి సర్వదా/ నహి సత్యాత్ పరం వాక్యం/ శ్రోతుమిఛ్ఛామి కేనచిత్ …” ఇది మలయశ్రీ గారు రచించిన ‘మానవ గీత’ లోని మొదటి శ్లోకం. దీని అర్థం.. సత్యమునే పలికెదను, సదా సత్యమునే ఆలోచించెదను, సత్యము కాని వాక్యమును వినుటకు కూడా ఇష్టపడను.
దీనిని త్రికరణ శుద్ధిగా ఆచరించిన వారు మలయశ్రీ . భాష, సాహిత్యము, చరిత్ర,శాస్త్రీయ విషయాలకు సంబంధించి మాట్లాడే ప్రతి మాట తార్కిక చింతనతో సాధికారికంగా ఉండేది.ఇతరులతో తనకు..తనతో ఇతరులకు పొసగని తనంలోంచి కొన్నిసార్లు అసంబద్ధంగా మాట్లాడి ఉండవచ్చు కానీ, సత్యాన్నే జీవిత ఆచరణగా ఎంచుకున్న ఆయన నిజాయితీ..భౌతిక వాదిగా,ఆచరణవాదిగా ఎవరికీ అందనంత ఎత్తులో ఆయన్ని నిలబెట్టింది.
శతాధిక గ్రంథకర్త, గొప్ప పరిశోధకుడు, భౌతిక వాది, తెలంగాణ భాష పట్ల అవ్యాజమైన ప్రేమ కలిగిన గొప్ప సాహితీవేత్త మళయశ్రీ. తెలంగాణలో మొదటి భౌతిక వాదిగా,మొదటి బాల సాహితీ వేత్తగా, మొట్టమొదటిసారి ‘కరీంనగర్ జిల్లా వెయ్యేళ్ళ సాహిత్య చరిత్ర’ పరిశోధన గ్రంథాన్ని వెలువరించి,సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసుకున్నారు మలయశ్రీ. సాహిత్యంలోని కథ, కవిత్వం, నవల, నాటకం, వ్యాసం, అనువాదం, పరిశోధన, విమర్శ మొదలైన అన్ని ప్రక్రియల్లోనూ సజన చేసిన సాహితీవేత్త తెలంగాణలో మరొకరు లేకపోవచ్చు.
అక్టోబర్ 10, 1940లో కరీంనగర్ జిల్లాలోని చెంజర్ల గ్రామంలో జన్మించారు మలయశ్రీ .ఇతని అసలు పేరు సంగని మల్లయ్య తొలత ఉపాధ్యాయుడిగా చేరి, తర్వాత లెక్చరర్ గా రిటైర్ అయ్యారు. వీరి భార్య భారతమ్మ. కొడుకు హర్షవర్ధన్, కూతురు జోత్స్న. కులాలు,మతాలను వ్యతిరేకించే మానవ వాదిగా తన కొడుకు కూతుళ్లకు మతాంతర వివాహాలను స్టేజి మ్యారేజీలు గానే జరిపించారు. తన తండ్రి చనిపోయినప్పుడు, తన భార్య చనిపోయినప్పుడు, జనన మరణాలు సాధారణంగా జరిగే సష్టికర్యాలనీ, వాటికి కర్మకాండలేవి అవసరం లేదని వాటికి దూరంగా ఉన్నారు.
1968లో ‘కావ్య సుందరి’ ఖండ కావ్య రచనతో ఆరంభించి, 20 గేయ కావ్యాలు’12 నవలలు’ ఐదు నాటకాలు’ ఆరు సీరియల్స్, 20 బాలసాహిత్య పుస్తకాలు, 20 వయోజన విద్య పుస్తకాలు, అనేక చరిత్ర పరిశోధన గ్రంథాలు, అనువాదాలు.. ఇలా దాదాపు 150 వరకు రాసిన పుస్తకాలతో శతాధిక గ్రంథకర్తగా పేరు గడించారు.
వీరి ‘శాంతి పథం’ నాటకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు, ‘కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర’ కాకతీయ మరియు శాతవాహన విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఎంఏ పాఠ్యాంశంగా కొన్నాళ్లు కొనసాగాయి. వీరు రచించిన ‘తిరుగుబాటు’ నవల విశాలాంధ్ర వారి బహుమతిని, ‘నిర్ణయం’ నవల మండలి వెంకటకష్ణ రావు గారి బహుమతిని, ‘మనిషి-మతం’ కొలకలూరి ఇనాక్ గారి బహుమతిని అందుకున్నాయి.
కాళిదాసు మేఘసందేశాన్ని ‘యక్ష సందేశం’గా తెలుగులోకి డఅనువదించారు. ‘ఐరేని కుండలు’ కథలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ‘శాంతిపథం’ ‘ప్రజాకవి వేమన’ ‘గణపతిదేవుడు’ ‘తొలి తెలుగు చక్రవర్తులు’ ‘ప్రతాపరుద్రుడు’ మొదలైన నాటకాలు వీరి సజనలో ఎన్నదగినవి. ‘తెలుగులో లేఖా సాహిత్యం’ ‘కాకతీయుల కాలంనాటి సామాజిక జీవితం’ ‘అరికేసరి 2’.. నవల (చివరి పుస్తకం) వీరి చారిత్రక పరిశోధక దష్టి కోణానికి నిదర్శనం.
మళయశ్రీ చారిత్రక పరిశోధనా ప్రతిపాదనలెన్నో విలువైనవిగా ఉన్నాయి. బుద్ధుని సమకాలికుడిగా భావించే భావరి ముని నివాసం ఉన్నది గోదావరి తీరంలోని ,’బాదనకుర్తి’ అని, శాతవాహనుల తొలి రాజధాని ‘కోటిలింగాల’ అని పశ్చిమాభిముఖముండి.. కోనేరు కలిగి ఉన్న యాదగిరిగుట్ట ఆదినాథాలయమే ‘యాదగిరి’గా మారిందని, కాళిదాసు మేఘసందేశం లోని యక్షుడు నివసించిన ప్రాంతం కరీంనగర్ జిల్లాలోని ‘రామగిరి ఖిల్లా’ అని చెప్పారు.
భాష, సాహిత్యాలపరంగా.. ‘తెలుంగు గనం’ నుంచి ‘తెలంగాణం’ పుట్టిందని, ‘ఆంధ్ర’ అనేది ‘జాతి పదం’ అని, అష్టదిగ్గజాలకు పూర్వీకుడైన ‘చరిగొండ ధర్మన’ ధర్మపురి నివాసి అని, నారాయణ శతక కర్త ‘నారయ’ అని, పలనాటి యుద్ధం లోని నాగమ్మ పుట్టింది కరీంనగర్ జిల్లాలోని ‘ఆరవెల్లి’ అని సమ్మక్క పుట్టింది కరీంనగర్ జిల్లాలోని ‘పొలవాస’ అనీ ఎన్నో ప్రతిపాదనలు చేసి రుజువులు సమర్పించారు.
తెలంగాణలోని బౌద్ధ జైన ఆనవాళ్ళపై కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. అశ్మక రాజధాని ‘పోతలి-బోధన్’ అని, బుద్ధుడి శిష్యుడు కొండన ‘కొండన్న’.. తెలుగువాడని, ‘జైన- జైనథ్’ అని, ‘జనగాం- జైన’ గ్రామం అని, ‘వర్ధన్నపేట’ వర్ధమాన మహావీరుడి పేరుతో వచ్చిందని, ఇలా మరెన్నో చారిత్రక విషయాలను తన పరిశోధనల ద్వారా ప్రతిపాదించారు. తెలంగాణ తెలుగే అసలు తెలుగు అని నిరూపించిన మలయశ్రీ కాళోజి జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా జరుపుకోవాలని 2005లోనే ప్రతిపాదించారు.
సత్యార్థి, భౌతిక వాది, పత్రికలను నడిపించి హేతువాద దృక్పథాన్ని ప్రచారం చేశారు. నవ్య సాహిత్య పరిషత్ సంస్థను ఏర్పాటు చేసి పలు సాహిత్య కార్యక్రమాల నిర్వహణతో పాటు, ‘మలయశ్రీ ప్రగతిశీల సాహిత్య అవార్డు’ పేరుతో సుమారు 50 మంది వరకు అవార్డులను ఇచ్చారు.
శాస్త్రీయ ఆలోచనే మానవ వికాసానికి ఆధారం అని నమ్మిన మలయశ్రీ జీవితమంతా భౌతిక వాదిగానే కొనసాగారు. ‘మూఢనమ్మకాల ముత్తాత పేరే దేవుడు’ అని చెప్పి, సామాజిక అంతరాలకు ఆర్థిక అసమానతలకు కారణమైన మతాన్ని వీడి, సత్యమార్గాన్ని ఎంచుకొని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకున్నప్పుడే మనుషులు పరస్పరం ప్రేమ పూర్వకంగా జీవించగలుగుతారని నమ్మి ప్రచారం చేసిన వారు.
”ఆశలేవి లేవు ఆశయాలు తప్ప/ పరుల బాధ తప్ప బాధ లేదు/ సుఖము కలదు ప్రజల సుఖమును కాక్షింతు/ బతుకు- బతుకనివ్వు బాటనాది” అని రాసుకున్న మలయశ్రీ మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన సృజనతో పోల్చి చూసినప్పుడు, ఆయనకు దక్కాల్సినంత కీర్తి ప్రతిష్టలు.. పురస్కారాలు దక్కలేదని చెప్పవచ్చు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినప్పుడు కనీసం ఆయనకు ఆహ్వానం లేదు. ఆయనను రమ్మని పిలిచిన వారు లేరు. ఇప్పటికైనా వీరి రచనలన్నింటినీ ప్రభుత్వం సమగ్ర సాహిత్యంగా ముద్రించి ముందు తరాలకు అందించవలసిన అవసరం ఉంది. ఆయన ఆశయాల కొనసాగింపు కోసం ఆయన జీవిత చరిత్రను రూపొందించవలసిన అవసరం ఉంది.
- గాజోజు నాగభూషణం,
9885462052


