నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రముఖ నటి త్రిష తీవ్రంగా స్పందించారు. “అగౌరవాన్ని ఖండించాల్సిందే, ఎప్పుడైనా సరే” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వివాదంపై తన న్యాయవాది ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసి, తన రాజకీయ వైఖరిపై పూర్తి స్పష్టత ఇచ్చారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇంతటి అనుచిత వ్యాఖ్యలు వస్తాయని తాను ఊహించలేదని త్రిష తన న్యాయవాది నిత్యేశ్ నటరాజ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని తేల్చి చెప్పారు. “వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ బహిరంగ చర్చకు పెట్టకూడదు. ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని ఆ ప్రకటనలో హితవు పలికారు. తనకు సంబంధం లేని విషయాల్లోకి తన పేరును లాగవద్దని త్రిష విజ్ఞప్తి చేశారు.



