నవతెలంగాణ-హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పరిశీలించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీ రెండున్నరేళ్ల క్రితం కుంగడంతో ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలు, ఇతర పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి డ్యాం సైట్లో నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. గతంలో 2024 ఫిబ్రవరి 13న సీఎం ఈ బ్యారేజీని సందర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం తొలుత కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడ శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు.
చివరగా కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సభావేదిక పైనుంచి రెండోవిడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.



