నవతెలంగాణ – ఊరుకొండ
యూరియా సరఫరా మరియు పంపిణీ మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించుటకు రూపొందించిన యూరియా బుకింగ్ యాప్ ను మరో రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని.. యూరియా అవసరమైన రైతులు ఇంటి నుండి యూరియా బుక్ చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారిని దీప్తి అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారిని దీప్తి మాట్లాడుతూ.. జిల్లాలో రిటైలర్లు, హోల్ సేలర్లు, మార్క్ ఫెడ్ మరియు కంపెనీ గోదాములలో కలిపి 2.80 లక్షల యూరియా బస్తాల నిల్వలు ఉన్నాయని.. వీటిలో ప్రస్తుతం 27,705 యూరియా బస్తాలు ఈ యాప్ లో బుకింగ్ కొరకు అందుబాటులో ఉంచబడ్డాయని రెండు రోజుల్లో బుకింగ్ చేసుకునేందుకు అందుబాటులోకి వస్తాయని ఏవో తెలిపారు.
యూరియా బుకింగ్ యాప్ ప్రారంభమైన తర్వాత ఎరువుల డీలర్లు అందరూ యాప్ లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు వ్యవసాయ అధికారులు జారీచేసిన ఆదేశాలను పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే ఎరువుల లైసెన్సులు రద్దు చేయబడుతాయని తెలిపారు. యాప్ లో పంటల వివరాలు మరియు సాగు విస్తీర్ణం ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు సరైన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
అంతర్జాతీయ పరిస్థితులు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నందున ఈ సంవత్సరం యూరియా సరఫరా సమృద్ధిగా ఉంటుందని తెలిపారు. రైతులు అపోహలు, వదంతులను నమ్మకుండా వ్యవసాయ శాఖ సూచనలు పాటించి యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు.



