Thursday, August 20, 2026
E-PAPER
Homeఆటలుగెలుపు బాటలో..!

గెలుపు బాటలో..!

- Advertisement -

విజయానికి ఆరు వికెట్ల దూరంలో భారత్‌
శ్రీలంక లక్ష్యం 372, ప్రస్తుతం 84/4
రిషబ్‌ పంత్‌ ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌

భారత్, శ్రీలంక తొలి టెస్టు 
నాల్గో రోజు

గాలె టెస్టులో టీమ్‌ ఇండియా గెలుపు దిశగా సాగుతోంది. నాలుగు రోజుల ఆటలో ఆతిథ్య శ్రీలంకపై ఆధిపత్యం చెలాయించిన శుభ్‌‌మన్‌‌సేన.. విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. ఓ వైపు వరుణుడి ముప్పు పొంచి ఉన్నా.. టాప్‌ ఆర్డర్‌‌ను ఇప్పటికే సాగనంపటంతో ఆఖరు రోజు విజయంపై కన్నేసి భారత్‌‌ బరిలోకి దిగుతోంది. రిషబ్‌ ‌పంత్‌ (66) ‌ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌‌తో భారత్‌ ఆతిథ్య శ్రీలంకకు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. మానవ్‌ ‌సుతార్‌ మాయతో శ్రీలంక 84/4తో నైరాశ్యంలో కూరుకుంది. తొలి టెస్టులో నేడు ఆఖరు రోజు.

​నవతెలంగాణ-గాలె
తొలి టెస్టులో విజయానికి భారత్‌ ‌రంగం సిద్ధం చేసుకుంది. రిషబ్‌ ‌పంత్‌ (66, 69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) తనదైన శైలిలో ధనాధన్‌ అర్థ సెంచరీతో చెలరేగటంతో భారత్‌ ‌రెండో ఇన్నింగ్స్‌‌లో 193 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 178 పరుగులతో కలిపి ఆతిథ్య శ్రీలంకకు 372 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లు మానవ్‌ ‌సుతార్‌ (2/30), మహ్మద్‌ ‌సిరాజ్‌ (1/11), ప్రసిద్‌ ‌కృష్ణ (1/13) వికెట్ల వేటలో రాణించటంతో ఛేదనలో ఆతిథ్య శ్రీలంక 84/4తో ఒత్తిడిలో కూరుకుంది. నేడు ఆఖరు రోజు ఆటలో భారత్‌ ‌విజయానికి మరో ఆరు వికెట్లు అవసరం కాగా.. శ్రీలంక మరో 288 పరుగులు చేయాల్సి ఉంది. నాల్గో రోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌ ‌సెంచరీ హీరో సోనల్‌ ‌దినుశ (25 నాటౌట్‌, 36 బంతుల్లో 4 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (31 నాటౌట్‌, 73 బంతుల్లో 3 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు.

​ఇంకో ఆరు వికెట్లే
శ్రీలంక లక్ష్యం 372. గతంలో శ్రీలంక ఈ తరహా లక్ష్యాలను రెండు సార్లు ఛేదించింది. టెస్టు క్రికెట్‌‌లో ఇటీవల వరుస సంచలనాలు, ఊహకందని ఫలితాల నేపథ్యంలో ఆతిథ్య శ్రీలంక గెలుపు ఆశలతోనే క్రీజులోకి వచ్చింది. కానీ పేసర్‌ ‌మహ్మద్‌ ‌సిరాజ్‌ ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లోనే బ్రేక్‌ ‌సాధించాడు. ఓపెనర్‌ ‌నిశాన్‌ ‌మధుష్క ఫెర్నాండో (6)ను సాగనంపి వికెట్ల వేటకు తెరతీశాడు. స్పిన్నర్‌ ‌మానవ్‌ ‌సుతార్‌ మాయాజాలంతో లహిరు ఉదార (16), పసిందు సూర్యబండార (0)లను సాగనంపాడు. పేసర్‌ ‌ప్రసిద్‌ ‌కృష్ణ ప్రమాదకర కామిందు మెండిస్‌ (2)ను అవుట్‌ ‌చేశాడు. దీంతో 47/4తో శ్రీలంక కష్టాల్లో కూరుకుంది. ధనంజయ డిసిల్వ (31 నాటౌట్‌), సోనల్‌ ‌దినుశ (25 నాటౌట్‌) ఐదో వికెట్‌‌కు అజేయంగా 37 పరుగులు జోడించారు. 34 ఓవర్లోనే 4 వికెట్లు కూల్చిన భారత్‌ ‌విజయానికి చేరువ కాగా.. టాప్‌ ఆర్డర్‌ ‌వైఫల్యంతో శ్రీలంక మానసికంగా ఓటమి కోరల్లో చిక్కుకుంది. నేడు వర్షంపై భారీ ఆశలు పెట్టుకున్న శ్రీలంకను కెప్టెన్‌ ‌డిసిల్వతో పాటు దినుశ, డిక్వెలా ఏ మేరకు ఆదుకుంటారో చూడాలి. వాతావరణం అనుకూలిస్తే రెండు సెషన్లలోనే లాంఛనం ముగించేందుకు భారత్‌ ‌సిద్ధమవుతోంది. స్పిన్నర్‌ ‌రవీంద్ర జడేజా బ్యాటర్లను కట్టడి చేసినా వికెట్‌ ‌పడగొట్టలేదు.

​పంత్‌ ‌ఫటాఫట్‌
అంతకుముందు భారత్‌ ‌రెండో ఇన్నింగ్స్‌‌లో 48.5 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. పేసర్‌ అసిత ఫెర్నాండో (4/31), స్పిన్నర్‌ ‌ప్రభాత్‌ ‌జయసూర్య (3/43), లహిరు కుమార (2/28) వికెట్లు పడగొట్టారు. ఓపెనర్‌ ‌యశస్వి జైస్వాల్‌ (0) ‌తొలి ఓవర్లోనే అవుట్‌ ‌కాగా.. కెఎల్‌ ‌రాహుల్‌ (35, 47 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లు), దేవదత్‌ ‌పడిక్కల్‌ (44, 75 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌‌కు 65 పరుగులు జోడించారు. కెఎల్‌ ‌రాహుల్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌ (8) ఎంతోసేపు నిలువలేదు. ధ్రువ్‌ జురెల్‌ (7), రవీంద్ర జడేజా (9), మానవ్‌ ‌సుతార్‌ (9)‌లు సైతం నిరాశపరిచారు. ఈ దశలో రిషబ్‌ ‌పంత్‌ (66) ‌తనదైన ఇన్నింగ్స్‌ ఆడాడు. పరుగుల వేట కష్టమైన తరుణంలో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 53 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన రిషబ్‌ ‌పంత్‌ భారత్‌‌కు మంచి స్కోరు అందించాడు. తొలి ఇన్నింగ్స్‌‌లో 178 పరుగుల ఆధిక్యం భారత్‌‌ను ముందంజలో నిలిపింది.

​స్కోరు వివరాలు
భారత్‌ ‌తొలి ఇన్నింగ్స్‌ : 462/10
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ : 284/10

భారత్‌ ‌రెండో ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (‌సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 0, రాహుల్‌ (‌సి) రత్ననాయక (బి) జయసూర్య 35, పడిక్కల్ (ఎల్బీ) నువాంత 44, గిల్‌ (ఎల్బీ) జయసూర్య 8, పంత్‌ (‌సి) డిక్వెలా (బి) కుమార 66, జురెల్‌ (‌సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 7, జడేజా (సి) సూర్యబండార (బి) కుమార 9, సుతార్‌ (‌సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 9, కుల్‌‌దీప్‌ (‌సి) డిసిల్వ (బి) జయసూర్య 5, సిరాజ్‌ ‌నాటౌట్‌ 2, ప్రసిద్‌ (‌సి)కుమార (బి) ఫెర్నాండో 2, ఎక్స్‌‌ట్రాలు : 6, మొత్తం : (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 193.
వికెట్ల పతనం : 1-0, 2-65, 3-81, 4-111, 5-120, 6-174, 7-179, 8-188, 9-190, 10-193.
బౌలింగ్‌ : అషిత ఫెర్నాండో 8.5-0-31-4, నువాంత 23-3-86-1, జయసూర్య 11-0-43-3, డిసిల్వ 1-0-4-0, కుమార 5-0-28-2.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ : మధుష్క (సి)ప్రసిద్‌ (‌బి) సిరాజ్‌ 6, లహిరు ఉదార (సి) జురెల్‌ (‌బి) మానవ్‌ 16, సూర్యబండార (ఎల్బీ) మానవ్‌ 0, మెండిస్‌ (‌సి) రాహుల్‌ (‌బి) ప్రసిద్‌ 2, డిసిల్వ నాటౌట్‌ 31, దినుశ నాటౌట్‌ 25, ఎక్స్‌‌ట్రాలు : 4, మొత్తం : (34 ఓవర్లలో 4 వికెట్లకు) 84.
వికెట్ల పతనం : 1-13, 2-14, 3-21, 4-47.
బౌలింగ్‌ : మహ్మద్‌ ‌సిరాజ్‌ 5-1-11-1, మానవ్‌ ‌సుతార్‌ 11-0-30-2, 
ప్రసిద్‌ ‌కృష్ణ 8-2-13-1, రవీంద్ర జడేజా 6-0-16-0, కుల్‌‌దీప్‌ ‌యాదవ్‌ 3-0-8-0, పడిక్కల్‌ 
1-0-5-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -