నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని మణికొండలో అర్ధరాత్రి భారీ పైప్ లైన్ పగిలింది. సింగూరు నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తీసుకువచ్చే పైప్ లైన్ పగిలి భారీ ఎత్తున వరద నీరు చుట్టుపక్కల అపార్ట్ మెంట్లను ముంచెత్తింది. ఎంప్లాయిస్ కాలనీ, శివసాయి కాలనీల్లోని సెల్లార్లలోకి వరద చేరడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. వరద ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీపంలోనే పందెన్ వాగు ఉండడంతో వరద నీరు అందులోకి చేరింది. లేదంటే మరికొన్ని కాలనీల్లోకి వరద చేరేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్ అధికారులతో పాటు పోలీసులు, అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైప్ లైన్ పగలడంతో రోడ్డు ధ్వంసం కాగా వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.



