నవతెలంగాణ – హైదరాబాద్:
చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 సెప్టెంబరు 26 – 1946 జూన్ 17) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస్సు లో ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం. లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26 న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం లోని ఖండవల్లి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత పాఠశాల గా మారింది. 30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. లక్ష్మీనరసింహం 1946, జూన్ 17 న మరణించారు.



