Monday, August 17, 2026
E-PAPER
Homeదర్వాజయువతా!ఓ యువతా!

యువతా!ఓ యువతా!

- Advertisement -

యువతా!ఓ యువతా!
నా వృద్ధాశల చిరకాంక్షల కవిత్వాభినివేశంలో
మిము నేనొక ముహూర్తంలో
అతి భీకర సోష్యల్ మాధ్యమాన
దూరంగా పలువీధుల్లో విహరించే
ఆకుకు అందని పోకకు పొందని తరాలుగా
భావించిన రోజులలో
మీకై బ్రతుకే ఒక తండ్లాటై
వెదుకాడే నిమిషాలందు నిశీధులందున
ఎటు నే చూచిన వికృతాలంకారపు
వేషధారణా ధోరణులలో
మీ రూపం కనరానందున
నా గుహలో గృహంలో చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?
మీ యవ్వన ప్రాబల్యంలో
నను మరల మొలకెత్తింపించిన ప్రేరణలో
సృజనద్వారపు తోరణమై వేలాడిన నా
మస్తకంలో
ఏయే పుస్తకాలు సమస్తాలు సన్నివేశాలో?
నేనేయే చిత్ర విచిత్ర శశ్వత్
భాస్వద్రచనలు చదివానో?
నా పద్యం ఏయే శక్తులలో
జీవద్రవ్యం పొందిందో?
మీకై నేనేరిన వేయే సడులో
ఏయే వెదికిన రాసుల
రాసుల పోరుల నుడులో
నడి పగలే నేల ఈనిన
జంతర్ మంతర్ ఝంఝా ప్రభం’జనం’
గడగడ లాడించిన
నడివీధుల జనకెరటాలై సాగించిన
మరోప్రపంచప్రస్థానం…పతాకశీర్షికల్లో
ప్రధానస్థానం
ఆ రోజే-
భూనభోంతరాళాల దద్దరింపు
భూకంపం-ప్రభుత్వ కంపం
ఉద్యమం-నిరసనం
అన్నీ మీ చైతన్యం
మీ విరాడ్రూప ప్రత్యక్షీకరణం
మరి మిమ్ము స్మరిస్తే
గద్దించిన గద్దెలలో కదలిక
న్యాయస్థానం కనులు తెరిచిన మెలకువ
టియర్ గ్యాస్ సైతం కన్నీరైన క్షణం.
ఇంకా నేనేం స్మరించానా?
నడిరే నిద్దురలో దుస్స్వప్నాలను కాంచే
నిరుద్యోగ యువకుని మనోవేదనాతరంగాలు
శిక్షకభటుల దమనకాండలో
చావుబతుకుల సంధ్యాకాలంలో
కన్నులు మూసిన జెన్ జీ తరపు
తరఫున వచ్చిన గుండెచప్పుడులు
రాళ్ళు కరిగిపోయే
వ్రీడ విడిచిన రక్షకభటుల రాక్షసక్రీడలో
జాడలేని అనేక అనేక అనేక జెన్ జీ పిల్లలు
రక్త సిక్త శరీరాలు వ్యక్తం చేసిన రహస్యాలు
గుమిగూడిన పిల్లల తండ్రుల తల్లుల
కడుపు కోతల గర్భశోకాల
హాహాకారాల్!ఆర్తనాదాల్!
ఒక మిలియన్ దిక్కుల పిక్కటింపులు
ఒక బిలియన్ ఉరుముల ఆర్భటులు
ఒక ట్రిలియన్ మెరుపుల తళత్తళలు
అన్నీ స్మరించాను-
ఈ స్మరణలు స్ఫురణలు విన్నవించగా
మాటలకై వెదుకాడగబోతే
అవి
తామరతంపరగా
బారికేడ్ల నిఘంటువులు దాటి
లాఠీల భయాలు విడిచి
కాల్పుల సర్పపరిష్వంగం వదలి
వడిగా జడిగా సుడిగా
వెలువడినై నా ఎద నడుగిడినై
నా స్మరించిన రచించిన పద్యంలో
నా జడత్వ మూఢత్వ పరంపరలన్ని
పరం పరం పప్పు పప్పు నుగ్గు నూచై
నన్నమందానంద భరిత హృదయుని చేస్తే
మీకై మేల్కొని తెలివికొచ్చిన సకలేంద్రియములతో
నా నాడుల తీగలపై సాగిన రక్తచలనసంగీతం
సమ్మోదం ఆమోదం ప్రమోదం
ఒక శాశ్వత దివ్యానుభవం
కలిగించిన కల్పించిన కరిగించిన
నవతా!భవితా!
యువతా!ఓ యువతా
నా గుహలో గృహంలో చీకటిలో
చైతన్యం లేకుండా నిద్రిస్తూన్న
నా కదలిక లేనితనానికి
గమనం కలిగించిన నాడో
నా అంతర్ బహిరింద్రియాలలో
జంతర్ మంతర్ ప్రవహించగ
నిర్భయ నిర్భీతిముద్ర ధరించి నను చేరిన
నను పునర్జీవితుని చేసిన యువతా!
నను సిగ్గిలజేసిన చలన సహితా!
సంచలన మహితా!అపరిమితా!
యువతా!ఓ యువతా!
నేడో నా ఊహాంచల సాహసికాంసం
కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా?
ఊహూ…నాకంత స్థాయా?
మీరే మీరే ఏదో విరచిస్తారు వినిర్మిస్తారు
రచిస్తారు నిర్మిస్తారు
మీ నిర్మాణంలో ఏదో తీర్మానం ప్రతిఫలించి
నా తండ్లాట కొసముడుతుంది
మీ చలనసంగీతం జ్వలనమై తిరిగి
జాతి జనం పాడుకునే మంతర్ అవుతుంది
మీ ఆకసాలు లోకానికి చేరువై
నా ఆదర్శాలు అందరూ అందుకుంటారు
మీరు అహింసామూర్తులు
బోన్సాయి గాంధీ మహాత్ములు
మీ చకచ్ఛకిత చలనముల విసరిన
కొసగాలులతో నిర్మించిన
నా నుడి మీ గుడి
నా పద్యం మీ నైవేద్యం
మీ విసరిన వీరరస రాగాలాపం
ఓహో! ఓ జెన్ జీ తరమా!
మీ సాహసం చెప్ప తరమా!
ఓ ఆల్ఫా తరమా!
మీ ధైర్యం అల్పమని చెప్ప వశమా!
ఓ పరవశమా!యువకా!యువతీ!
యువతా!ఓ యువతా!ఓ కవితా!
– నలిమెల భాస్కర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -